Hepatitis: హెపటైటిస్‌తో ప్రమాదమే సుమా..!

తరచుగా వాంతులు కావడం, వికారంగా ఉండటం, ఆకలి లేకపోవడం..తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలు చూస్తే చాలా చిన్నవే... కానీ వీటి వెనక ప్రాణాంతకమైన హెపటైటీస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Published : 06 Aug 2022 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తరచూ వాంతులు కావడం, వికారంగా ఉండటం, ఆకలి లేకపోవడం.. తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలు చూస్తే చాలా చిన్నవే... కానీ వీటి వెనక ప్రాణాంతకమైన హెపటైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. కాలేయాన్ని ప్రమాదంలోకి నెట్టే హెపటైటిస్‌తోనే ఈ సమస్యలు వస్తాయి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణాలపైకి వస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు హెపటైటిస్‌ సులువుగా శరీరంలోకి వచ్చేస్తుందని గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్‌ సోమశేఖర్‌రావు పేర్కొన్నారు.

అతి పెద్ద అవయవం కాలేయం

ఇది శరీరంలో 500 రకాల విధులను నిర్వహిస్తుంది. ఆహారంలోని కొవ్వులను వేరు చేసి శక్తిగా మారుస్తుంది. జీర్ణశక్తికి అవసరమైన పైత్యరసాన్ని నిత్యం స్రవిస్తుంది. శరీరంలో విడుదలయ్యే హానికారక విషతుల్యాలను వేరు చేసి రక్షణ కల్పిస్తుంది. ఇంతటి కీలకమైన కాలేయానికి హెపటైటిస్‌ పెనుసవాల్‌గా మారింది. వైరల్‌ హెపటైటిస్‌ను నివారించవచ్చు కానీ హెపటైటిస్‌ బీ,సీలకు సకాలంలో వైద్యం అందించకపోతే ప్రాణాంతకంగా మారుతాయి. ఈ వైరస్‌ ఎలా వచ్చిందో అంతుచిక్కదు. దీర్ఘకాలికంగా సమస్యలు వస్తాయి. ఎ,ఈ వైరస్‌లు పెద్ద ప్రమాదకారి కాదు. ఇవి సోకినపుడు కామెర్లు, జ్వరం వస్తుంది. వాంతులుంటాయి. నీరసించిపోతారు. మలేరియా, డెంగీ, బ్యాక్టీరియాతో కూడా కాలేయం వాపుతో హెపటైటిస్‌ వస్తుంది.

ఇలా సంక్రమించవచ్చు..!

* రక్త మార్పిడి సమయంలోనూ, ఒకరికి వాడిన సిరంజిని మరొకరికి వాడినపుడు..

* గర్భిణి నుంచి బిడ్డకు, లైంగిక సంపర్కం ద్వారా బీ వైరస్‌ సోకుతుంది.

* ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే లివర్‌ క్యాన్సర్‌గా, సిర్రోసిస్‌గా మారుతుంది. హెపటైటిస్‌ లాగే సీ కూడా ప్రమాదకరమైందే. బీ వైరస్‌ను టీకాతో నివారించవచ్చు కానీ సీ వైరస్‌కు ఎలాంటి చికిత్స లేదు. 

* ఈ వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. నీరు, ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. బయట తినే ఆహారం మానేయాలి.

* కామెర్లు వస్తే విపరీతమైన పత్యాలు చేస్తారు. గంజి, జావ ఇస్తారు. ఇవి బలవర్ధకమైనవి కావు. కామెర్లతో బాధపడుతున్నపుడు సాధారణ ఆహారమే పెట్టాలి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని