TTD: తితిదే అవసరాలకు 12 రకాల ప్రకృతి వ్యవసాయోత్పత్తులు

తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్‌ మీడియాకు వెల్లడించారు.

Updated : 15 Apr 2023 20:12 IST

తిరుమల: అన్నమయ్య భవన్‌లో  తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  తిరుపతిలోని స్విమ్స్‌ పరిధిలో ఉన్న శ్రీపద్మావతి మహిళా వైద్య కళాశాలలో టీబీ, చెస్ట్‌, స్కిన్‌ ఇతర ఐసోలేషన్‌ వార్డులు, స్టాఫ్‌ క్వార్టర్స్‌, హాస్టళ్ల నిర్మాణ పనుల కోసం రూ.53.62 కోట్లు మంజూరు చేసినట్టు ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత పాలక మండలి నిర్ణయాలను ఛైర్మన్‌ మీడియాకు వెల్లడించారు. తితిదే అవసరాలకు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన 12 రకాల ఉత్పత్తులను కొనుగోలు చేయాలని తితిదే నిర్ణయించింది. ధరల నిర్ణయంపై రైతు సాధికార సంస్థ, మార్క్‌ఫెడ్‌తో చర్చించేందుకు తితిదే బోర్డు సభ్యులు  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సనత్‌ కుమార్‌, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. 

తాతయ్యగుంట గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.3.12 కోట్లు

అలిపిరి వద్ద మార్కెటింగ్‌ గోడౌన్‌  నూతన గోడౌన్ల నిర్మాణానికి రూ.18కోట్లు, కోల్డ్‌ స్టోరేజి నిర్మాణానికి రూ.14కోట్లు మంజూరు చేసినట్టు ఛైర్మన్‌ వెల్లడించారు. గుంటూరుకు చెందిన దాత ఆలపాటి తారాదేవి రూ.10లక్షలతో వెండి కవచాన్ని శ్రీబేడి ఆంజనేయస్వామికి సమర్పించేందుకు తితిదే ఆమోదం తెలిపింది. తిరుపతిలోని తాతాయ్యగుంట గంగమ్మ ఆలయం ఆధునికీకరణ  కోసం రూ.3.12 కోట్లతో టెండరుకు పాలకవర్గం ఆమోద ముద్ర వేసింది. న్యూడిల్లీలోని ఎస్వీ కళాశాల ఆడిటోరియం అభివృద్ధి పనుల కోసం రూ.4కోట్ల మంజూరుకు తితిదే ఆమోదం తెలిపింది.

జూన్‌ 15 నాటికి అందుబాటులోకి  శ్రీనివాససేతు

తితిదే విద్యాసంస్థల్లో రెగ్యులర్‌ బోధనా సిబ్బంది నియామకానికి ఆమోదం తెలపడంతో పాటు, ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ బోధనా సిబ్బందిని కొనసాగిస్తూనే రెగ్యులర్‌ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని పాలకమండలి నిర్ణయించింది. దిల్లీలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో మే 3 నుంచి 13 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహహంచనున్నట్టు ఛైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు.  తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీనివాస సేతు పనులు త్వరితగతిన పూర్తి చేసి జూన్‌ 15 నాటికి భక్తులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

విదేశీ భక్తుల నుంచి విరాళాల స్వీకరణ అనుమతి కోసం దరఖాస్తు

ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల స్వీకరణ చట్టం) ప్రకారం విదేశీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించడానికి తితిదేకి ఉన్న అనుమతి 2020 జనవరితో ముగిసింది. దీనిని రెన్యువల్‌ చేసుకోవడానికి తితిదే దరఖాస్తు చేసినట్టు ఛైర్మన్‌ తెలిపారు.  పలు దఫాలుగా కేంద్ర హోం మంత్రిత్వశాఖ అడిగిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించామన్నారు. ఎఫ్సీఆర్‌ఏ, రాష్ట్ర  దేవాదాయశాఖ చట్టాల మధ్య ఉన్న సాంకేతిక కారణాల వల్ల డిపాజిట్లపై వచ్చే వడ్డీని చూపించడంలో అభ్యంతరలు తెలిపారని, ఇది సాంకేతిక కారణం మాత్రమేనని చెప్పారు. ఏఫ్‌సీఆర్‌ఏ అధికారుల సూచన మేరకు త్వరగా లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోవడానికి రూ.3కోట్లు చెల్లించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని