ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. తెలుగు రాష్ట్రాల్లో పోస్టులు ఎన్నంటే?

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. ఇస్రో (ISRO) 500లకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌(Job Recruitment Notification)ఇచ్చింది. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచే దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించింది.

Updated : 20 Dec 2022 17:03 IST

దిల్లీ: నిరుద్యోగులకు ఇస్రో(ISRO) గుడ్‌న్యూస్‌ చెప్పింది. దేశవ్యాప్తంగా పలుచోట్ల ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ(Job Recruitment)కి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో మొత్తం 526 ఉద్యోగాల భర్తీకి ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌(ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌(ఐసీఆర్‌బీ) దరఖాస్తులను ఆహ్వానించింది.  హైదరాబాద్‌, శ్రీహరికోటతో పాటు పలు చోట్ల అసిస్టెంట్లు, జూనియర్‌ పర్సనల్‌ అసిస్టెంట్లు, యూడీసీ, స్టెనోగ్రాఫర్ల పోస్టుల కోసం నేటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఆయా పోస్టులను అనుసరించి అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో/ కనీసం 6.32 సీజీసీఏతో గ్రాడ్యుయేషన్‌/ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు కంప్యూటర్‌ పరిజ్ఞానం కూడా ఉండాలని పేర్కొంది. అలాగే, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు మించరాదని పరిమితి విధించింది. నెలకు రూ.25,500 చొప్పున వేతనం ఉంటుందని పేర్కొంది. 

ప్రాంతాల వారీగా ఖాళీలు.. ఉద్యోగ ఎంపిక ఇలా..

హైదరాబాద్‌లో 54 ఉద్యోగాలు ఖాళీగా ఉండగా.. శ్రీహరికోటలో 78, బెంగళూరులో 215, అహ్మదాబాద్‌ 31, హసన్‌ 17, దిల్లీ 02, తిరువనంతపురం 129 చొప్పున భర్తీ చేయనున్నట్టు ఐసీఆర్‌బీ వెల్లడించింది. స్టెనోగ్రాఫర్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఏడాది పాటు అనుభవం కలిగి ఉండాలని సూచించారు. రాత పరీక్ష/స్కిల్‌టెస్ట్‌/కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌/స్టెనోగ్రఫీ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక జరుగుతుందని స్పష్టం చేసింది. రాత పరీక్షలో సింగల్‌ ఆబ్జెక్టివ్‌ పేపర్‌ ఉంటుంది. 120 నిమిషాల్లో సమధానాలు గుర్తించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును రూ.100లుగా నిర్ణయించారు. డిసెంబర్‌ 20 నుంచి జనవరి 9 వరకు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని సూచించింది. ఈ పరీక్షలు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దేహరాదూన్‌, అహ్మదాబాద్, గువాహటి, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, దిల్లీ, తిరువనంతపురంలలో నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం https://www.isro.gov.in/లో చూడొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని