Amaravati: ఏపీలో 62,754 మంది విద్యార్థులు మృతి.. జీఈఆర్‌ సర్వే వివరాలు బయటపెట్టిన నాదెండ్ల

వైకాపా పాలనలో 62,740 మంది పాఠశాల విద్యార్థులు మరణించినట్టు జీఈఆర్‌ సర్వేలో తేలిందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Updated : 08 Sep 2023 21:26 IST

అమరావతి: వైకాపా పాలనలో 62,754 మంది పాఠశాల విద్యార్థులు మరణించినట్టు జీఈఆర్‌ సర్వేలో తేలిందని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మనోహర్‌.. పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన జీఈఆర్‌ సర్వే వివరాలను వెల్లడించారు. సర్వేలో వెల్లడైన అంశాలు వైకాపా ప్రభుత్వ అసమర్థతను తేటతెల్లం చేసేలా ఉన్నాయన్నారు. 2021-22 విద్యాసంవత్సరంలో 62,754 మంది బడి ఈడు పిల్లలు మరణించారని ఇటీవల ఆగస్టు వరకు విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌(GER) సర్వే ద్వారా బయటపడిందన్నారు. రాష్ట్రంలోని 13,676 గ్రామ సచివాలయాలు, 15,104 వార్డు సచివాలయాల వాలంటీర్ల ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో నమ్మలేని వాస్తవాలు వెలుగు చూశాయన్నారు. 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసున్న 62,754 మంది విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందినట్టు ఈ సర్వే ద్వారా బహిర్గతమైందన్నారు. 

అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో, ఆ తర్వాత అనంతపురం, గుంటూరు జిల్లాల్లో విద్యార్థులు ఎక్కువ మంది చనిపోయినట్టు వివరించారు. పాఠశాల విద్యార్థులు చనిపోవటం ఊహించని పరిణామమని, ఇంత ప్రధానమైన అంశంపై ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవటం లేదని ప్రశ్నించారు. 3.88 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి డ్రాపౌట్‌ అయ్యారని, 2.29లక్షల మంది విద్యార్థులు కనిపించడం లేదని సర్వేలో తేలిందన్నారు. ఈ సర్వే వివరాల్ని ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలన్నారు. నాడు-నేడు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజన పథకం, వసతి దీవెన, విద్యా దీవెన పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గొప్పలకు పోతున్నారని.. పాఠశాలల్లో ఆరోగ్య వ్యవస్థ ఎందుకు పాడైందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తల్లిదండ్రుల ఆవేదనను ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకోవటం లేదు? 151 స్థానాలు ఇచ్చినందుకు ప్రజలకు మీరు చేసేది ఇదేనా అని నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.

విద్యార్థుల మరణాలకు కారణాలు ఏమిటి?

‘‘ఇంత మంది విద్యార్థులు మృతి చెందటం వెనుక ఉన్న కారణాలు బయటపెట్టాలి. పిల్లల ఆరోగ్యం సరిగా లేక చనిపోయారా? లేక  ఈ ప్రభుత్వం అమ్మ ఒడి పథకంలో కోతల కోసం ఈ లెక్కలు చెబుతుందా అనేది  కూడా బయటపెట్టాలి. మరో వైపు విద్యాసంస్కరణల పేరుతో పాఠశాలలను విలీనం చేసి, ఉపాధ్యాయులను తగ్గించే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం ఈ కొత్త లెక్కలను బయట పెట్టిందా? అనే అనుమానం కలుగుతోంది. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు బహిరంగంగా సమాధానం చెప్పాలి’’ అని మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని