ఆయన టైప్‌ చేస్తే..రికార్డులే..!

సాధించాలన్న తపన..ఆసక్తి ఉంటే చాలు రికార్డులు దాసోహం అంటాయి అంటున్నారు దిల్లీకి చెందిన వినోద్‌ కుమార్ చౌధురి. దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ)లో స్కూల్‌ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్‌ సైనెస్స్‌ విభాగంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన ఇప్పటి వరకు...

Published : 21 Jun 2021 01:14 IST

దిల్లీ: సాధించాలన్న తపన..ఆసక్తి ఉంటే చాలు ఎన్ని రికార్డులైనా సాధించవచ్చు అంటున్నారు దిల్లీకి చెందిన వినోద్‌ కుమార్ చౌధురి. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ(జేఎన్‌యూ)లో స్కూల్‌ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్‌ సైనెస్స్‌ విభాగంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఆయన ఇప్పటి వరకు 9 గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డులు నమోదుచేశారు. ఏంటీ..తొమ్మిది గిన్నిస్‌ రికార్డులా..అని ఆశ్చర్యపోకండి. అవునండీ.. వివిధ పద్ధతుల్లో వేగంగా టైప్ చేసే వ్యక్తిగా ఆయన ఈ రికార్డులు నమోదు చేశారు. ముక్కుతో వేగంగా టైప్‌ చేయడం (2014), కళ్లకు గంతలు కట్టుకుని వేగంగా టైప్ చేయడం, మౌత్‌స్టిక్‌తో వేగంగా టైపింగ్‌ వంటి రికార్డులు ఆయన పేరిట ఉన్నాయి. తాజాగా కొవిడ్-19 లాక్‌డౌన్‌లో ఆయన మరో గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.     

చిన్నతనం నుంచి  క్రీడలంటే అమితాసక్తి ఉన్న వినోద్‌కు వేగంగా పనులు చేయాలని తపన పడుతుండేవారట. కానీ, ఆరోగ్య కారణాల వల్ల క్రీడలని మధ్యలో వదిలేయాల్సివచ్చింది. దాంతో కంప్యూటర్‌పై ఇష్టం ఏర్పరచుకుని వేగంగా టైప్‌ చేయడం సాధన చేశారు. అలా 2014లో ముక్కుతో 103 అక్షరాలను కేవలం 46.03 సెకన్లలో టైప్‌ చేసి తొలి రికార్డు నమోదుచేశారు‌. తొలి గిన్నిస్‌ రికార్డు ఇచ్చిన స్ఫూర్తితో  2016లో 6.71, 6.09 సెకన్లలో టైప్‌ చేసి మరో రెండు రికార్డులు, 2017లో ఆంగ్ల అక్షరాలను 18.65 సెకన్లలో టైప్ చేసి రికార్డు నమోదుచేశారు. మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్ తెండూల్కర్‌లా తాను కూడా 19 గిన్నిస్‌ రికార్డులు సాధిస్తానని వినోద్ చెబుతున్నారు. చివరగా చేతితో టెన్నిస్‌ బాల్‌ను ఒక నిమిషంలో ఎక్కువ సార్లు అంటుకున్న వ్యక్తిగా రికార్డు నమోదు చేశారు. సొంతగా కంప్యూటర్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి తనలా మరికొంతమందికి కంప్యూటర్‌లో శిక్షణ ఇవ్వాలనుకుంటున్నట్లు వినోద్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని