శీతాకాలం నేపథ్యంలో కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రం మూసివేత

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేశారు. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆలయం మూసి ఉంటుందని చార్‌ధామ్ దేవస్థానం నిర్వహణ బోర్డు వెల్లడించింది.

Published : 06 Nov 2021 23:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేశారు. వచ్చే ఆరు నెలల పాటు ఈ ఆలయం మూసి ఉంటుందని చార్‌ధామ్ దేవస్థానం నిర్వహణ బోర్డు వెల్లడించింది. ఈ ఆరు నెలల పాటు కేదార్‌నాథుడికి ఓంకారేశ్వర్‌లో పూజలు నిర్వహించనున్నారు. సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేదార్‌నాథుడి విగ్రహాలను ఓంకారేశ్వర్ ఆలయానికి తరలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు హాజరయ్యారు. యమునోత్రి ఆలయాన్ని సైతం శనివారం మధ్యాహ్నం మూసివేయనున్నారు. యమునా దేవి విగ్రహాన్ని ఖర్సాలి గ్రామానికి తీసుకెళ్లనున్నారు. గంగోత్రి ఆలయాన్ని ప్రత్యేక పూజల అనంతరం శుక్రవారం మూసివేసి.. ఆలయంలోని ఉత్సవ డోలీని ముఖ్బాకు తరలించారు. ఆరు నెలల పాటు గంగామాతకు అక్కడే పూజలు జరగనున్నాయి. ఈ నెల 20న బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. ఉత్తరాఖండ్‌లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాలను కలిపి చార్‌ధామ్‌గా పిలుస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని