Published : 09 Oct 2020 15:13 IST

ఏఐతో పెద్దఎత్తున ఉద్యోగాలు

విద్యార్థులు అందుకు సన్నద్ధమవ్వాలి
‘ఈనాడు-హైసియా’ వెబినార్‌లో వక్తలు

హైదరాబాద్‌: కృత్రిమ మేధ (ఏఐ)దే భవిష్యత్‌ అని, ఈ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రానున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే అభిప్రాయం సరికాదని, పాత ఉద్యోగాలు పోయి కొత్తవి వచ్చి చేరతాయని చెప్పారు. ఏఐ వల్ల రాబోయే రోజుల్లో పెనుమార్పులు సంభవించనున్నాయని, అందుకు అనుగుణంగా విద్యార్థులు సన్నద్ధమవ్వాలని సూచించారు. ‘ఈనాడు-హైసియా’ ఆధ్వర్యంలో ‘ఏఐ- విద్య, ఉద్యోగావకాశాలు’ అనే అంశంపై వెబినార్‌ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌, హైసియా అధ్యక్షుడు భరణి కుమార్‌ అరోల్‌, హ్యూసిస్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ జీఆర్‌ రెడ్డి మాట్లాడగా.. ఐఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ రమేశ్‌ లోగనాథన్‌ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఏఐకి సంబంధించి ఎన్నో విలువైన సూచనలు చేశారు. వెబినార్‌లో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు అడిగిన ప్రశ్నలకు వారు సమాధానం ఇచ్చారు.

తెలంగాణలో 30వేల ఉద్యోగాలు

-జయేశ్‌ రంజన్‌

‘‘కొవిడ్‌-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నష్టపోయాయి. మన దేశ జీడీపీ కూడా పడిపోయింది. ఈ క్రమంలో సాంకేతికతపై ఆధారపడడం పెరిగింది. కొవిడ్‌ తర్వాత ఇది మరింత పెరగనుంది. కృత్రిమ మేధ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. దీని ద్వారా కొవిడ్‌-19ను నియంత్రణ సాధ్యపడుతోంది. కొవిడ్‌ పరీక్షల్లోనూ ఉపయోగపడుతోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఏఐని పెద్దఎత్తున వినియోగిస్తోంది. 2020ని తెలంగాణ ప్రభుత్వం కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించింది. ప్రభుత్వం, ప్రైవేటు, శిక్షణ సంస్థల్లో దీని వినియోగం క్రమంగా పెరుగుతోంది. కృత్రిమ మేధను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. ఇప్పటికే 19 రకాల ఉద్యోగాలను గుర్తించాం. 2022 నాటికి ఈ రంగంలో తెలంగాణలో 30వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జేఎన్‌టీయూలో బీటెక్‌లో ఏఐకి సంబంధించిన కోర్సును తప్పనిసరి చేశాం. ఇప్పటికే పరిధిలో 4 కళాశాలల్లో ఈ మేరకు కోర్సును ప్రవేశ పెట్టాం. దాదాపు 45 కళాశాలలు ఏఐ కోర్సులను తీసుకొచ్చేందుకు ముందుకొచ్చాయి. ఏఐకి సంబంధించి ఎక్కువ అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి’’ అని జయేశ్‌ రంజన్‌ అన్నారు.

అపోహ మాత్రమే..

- భరణి కుమార్‌ అరోల్

‘‘మెషిన్లను మానవుడిలా ఆలోచించేలా చేయడం కోసం ఈ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అవసరం. రాబోయే ఐదేళ్లలో ఏఐ ద్వారా దేశంలో 5.5 కోట్ల ఉద్యోగాలు వస్తాయి. కంపెనీలు పెద్దఎత్తున ఇందులో పెట్టుబడులు పెట్టనున్నాయి. దీంతో ఉద్యోగావకాశాలు రానున్నాయి. డిజిటల్‌ టెక్నాలజీ నేర్చుకున్నవారు కేవలం 20 శాతం మాత్రమే ఉన్నారు. రాబోయే నాలుగైదు ఏళ్లలో ఇలాంటి వారికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏఐకి మించి ఏజీఐ (ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటిలిజెన్సీ) రాబోతోంది. దానికి మరో పదేళ్లు పడుతుంది. ఏఐ కారణంగా జాబ్స్‌ పోతాయనేది నిజమే. కంప్యూటర్లు వచ్చిన కొత్తలో కూడా ఈ భయం ఉండేది. కానీ, కొత్త జాబ్స్‌ వచ్చాయి. ఏఐ విషయంలోనూ అంతే. దానికి అనుగుణంగా మనం మార్పులు చేసుకోవాలి. ఏఐ ఉద్యోగాలు తొలగిస్తుందే తప్ప వ్యక్తులను కాదు’’ అని భరణి కుమార్‌ అన్నారు. విద్యార్థులు తమ సందేహాల నివృత్తికి హైసియా వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.

సర్టిఫికెట్లు ముఖ్యం కాదు..

-జీఆర్‌ రెడ్డి

ఏఐలో రాణించాలంటే సర్టిఫికెట్‌ కోర్సులు మాత్రమే చేస్తే సరిపోదు అని జీఆర్‌ రెడ్డి అన్నారు. కంపెనీలు సైతం ఏ కోర్సు చేశామనే దానికన్నా ఏం నేర్చుకున్నారనేది చూస్తున్నాయని చెప్పారు. కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకోవడం కంటే.. స్టార్టప్‌లో చేరి సేవలందించడం ఉత్తమం మని అభిప్రాయపడ్డారు. విద్యార్థులకు ఒక స్టార్టప్‌ ఐడియా ఉన్నప్పుడు సొంతంగా ముందుకెళ్లడం కంటే మెంటార్‌ను వెతుక్కోవాలని సూచించారు. లింక్డిన్‌ వంటి వేదికలను ఇందుకు వినియోగించుకోవాలని సలహా ఇచ్చారు. నాలుగేళ్లలో కాలేజీ చదువు అనంతరం.. కొత్తగా నేర్చుకోవడమనే దానికంటే మొదటి రోజు నుంచే విద్యార్థులు నేర్చుకోవడం ప్రారంభించాలని సూచించారు. దగ్గర్లో ఉన్న కంపెనీలో పనిచేసి ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ను సంపాదించడం ఎంతో అవసరం అన్నారు. ఏదైనా సరే కొత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. హ్యాకథాన్‌లలో పాల్గొనడం మంచిదని జీఆర్‌ రెడ్డి సలహా ఇచ్చారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని అందుకుంటే విజయం సాధించినట్లేనని వక్తలు అభిప్రాయపడ్డారు. అలాగే పిల్లలు ఏం చేయాలనుకుంటున్నారో ఆ మార్గంలో ప్రయాణించేందుకు తల్లిదండ్రులు మార్గ నిర్దేశనం చేయాలని సూచించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని