Depression: ఒకదగ్గర కుదురుగా ఉండాలంటే ఏం చెయ్యాలి?

Health Q & A: నాకు చిన్నప్పుడే కుంగుబాటు వచ్చింది. తర్వాత కోలుకున్నా.. అయితే ఇప్పుడు నిద్ర పట్టడం లేదు. ఏం చేయాలి? 

Updated : 29 Oct 2023 17:24 IST

సమస్య: నాకు 35 ఏళ్లు. చిన్నప్పుడు కుంగుబాటు (Depression) వచ్చింది. తర్వాత కోలుకున్నాను. ఇప్పుడు నిద్ర సరిగా పట్టటం లేదు. ఇప్పటివరకు ఎన్నో ఉద్యోగాలు మారాను. ఒకదగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నాను. నా సమస్యకు కారణమేంటి? ఒకదగ్గర కుదురుగా ఉండాలంటే ఏం చెయ్యాలి?

- ఒక పాఠకుడు (ఈమెయిల్‌)

సలహా: మీరు చిన్నప్పుడు కుంగుబాటుకు లోనైనప్పుడు చికిత్స తీసుకున్నారో లేదో తెలియజేయలేదు. ఎన్నాళ్లుగా కుంగుబాటుతో బాధపడ్డారు? ఎంతకాలం చికిత్స తీసుకున్నారు? అప్పుడు లక్షణాలు పూర్తిగా తగ్గాయా? లేదా? అనేవి చాలా కీలకం. ఎందుకంటే చికిత్స పూర్తిగా తీసుకోకపోతే కొన్ని కుంగుబాటు లక్షణాలు కొనసాగొచ్చు. బాధ, నిరాశ, నిస్పృహ వంటి తీవ్రమైన లక్షణాలు తగ్గిపోయినా ఎవరూ నచ్చకపోవటం, ఏ పని చేసినా సంతృప్తి లేకపోవటం, పాత విషయాలు పదే పదే గుర్తుకు రావటం, నలుగురితో సర్దుకోలేకపోవటం, భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోవటం వంటి లక్షణాలు అలాగే ఉండిపోవచ్చు. వీటితోనూ సమస్యలు ఎదురవ్వచ్చు. ఎక్కడా కుదురుగా ఉండకపోవటానికి ఇవీ కారణం కావొచ్చు. ఇదొక్కటే కాదు, చేస్తున్న ఉద్యోగం మీకు సరిపోతోందో లేదో కూడా చూసుకోవాలి.

ఉద్యోగం దొరకటం ఎంత ముఖ్యమో నచ్చిన ఉద్యోగం, నచ్చిన చోట దొరకటమూ అంతే ముఖ్యం. అప్పుడే స్థిరంగా ఉండటం సాధ్యమవుతుంది. చేసే పని నచ్చక, బలవంతంగా చేస్తున్నా.. దానికి తగిన సామర్థ్యం లేకపోయినా సహజంగానే ఇష్టముండదు. అందువల్ల ఇలాంటి ఇబ్బందులేవైనా ఉన్నాయేమో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ పరిష్కారం మందులు, కౌన్సెలింగ్‌. మీరు ముందుగా మానసిక చికిత్స నిపుణులను సంప్రదించండి. మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లక్షణాలను బట్టి సమస్యను అంచనా వేస్తారు. ఇంకా కుంగుబాటు ప్రభావం ఉందా అనేది చూస్తారు. అవసరమైతే మందులు సూచిస్తారు. లేకపోతే ఆలోచనా విధానాన్ని మార్చేలా కౌన్సెలింగ్‌ (కాగ్నిటివ్‌ బిహేవియర్‌ థెరపీ) ఇస్తారు. ఉద్యోగం నచ్చకపోతే ఆలోచన తీరును మార్చుకోవటానికిది తోడ్పడుతుంది. కుదురుగా ఉండటానికి దోహదం చేస్తుంది.


మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను పంపాల్సిన ఈమెయిల్‌ చిరునామా: sukhi@eenadu.in


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని