మెదడు క్యాన్సర్‌కు వినూత్న జెల్‌ చికిత్స

మెదడు క్యాన్సర్‌ (గ్లయోబ్లాస్టోమా) తీవ్రమైందే కాదు, మొండిది కూడా. శస్త్రచికిత్సతో తొలగించినా కొద్ది నెలల్లోనే తిరిగి ఏర్పడుతుంటుంది. అందుకే దీని బారినపడ్డవారిలో 25% మందే ఏడాది వరకు జీవిస్తుంటారు. కేవలం 5% మందే ఐదేళ్ల వరకు జీవిస్తుంటారు. మెదడు క్యాన్సర్‌ చికిత్సలో

Updated : 16 Aug 2022 06:40 IST

మెదడు క్యాన్సర్‌ (గ్లయోబ్లాస్టోమా) తీవ్రమైందే కాదు, మొండిది కూడా. శస్త్రచికిత్సతో తొలగించినా కొద్ది నెలల్లోనే తిరిగి ఏర్పడుతుంటుంది. అందుకే దీని బారినపడ్డవారిలో 25% మందే ఏడాది వరకు జీవిస్తుంటారు. కేవలం 5% మందే ఐదేళ్ల వరకు జీవిస్తుంటారు. మెదడు క్యాన్సర్‌ చికిత్సలో కణితి లేదా గ్లయోమా మూల కణాలను సమూలంగా తీసేయలేకపోవటం పెద్ద సవాల్‌. ఈ కణాలు చాలా ఉద్రిక్తంగా ప్రవరిస్తుంటాయి. చుట్టుపక్కల కణజాలంలోకి తేలికగా, త్వరగా చొచ్చుకెళ్లిపోతాయి. అందువల్ల శస్త్రచికిత్స చేసే సమయంలో కణితి, మామూలు కణజాలం మధ్య సరిహద్దులను స్పష్టంగా గుర్తించటం శస్త్రచికిత్స నిపుణులకు సాధ్యం కాదు. మెదడులోని అన్ని కణజాలాలు ముఖ్యమైనవే కావటం వల్ల వీలైనంత ఎక్కువ భాగాన్ని తొలగించలేరు. ఇదే కణితి మళ్లీ ఏర్పడటానికిది వీలు కల్పిస్తుంది. ఫలితంగా జీవనకాలమూ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్సిన్‌ మాడిసన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫార్మసీ పరిశోధకులు వినూత్న హైడ్రోజెల్‌ను రూపొందించారు. దీన్ని కణితిని తొలగించిన భాగంలోకి ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. జిగురుద్రవం రూపంలో ఉండటం వల్ల క్రమంగా మెదడు అంతటా పరచుకుంటుంది. చుట్టుపక్కల కణజాలానికి నెమ్మదిగా మందును విడుదల చేస్తుంది. క్యాన్సర్‌ కణాలను చంపే రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఇలా గ్లయోమా మూలకణాలను నిర్మూలిస్తూ క్యాన్సర్‌ తిరగబెట్టటాన్ని నివారిస్తుంది. ఫలితంగా జీవనకాలమూ పెరుగుతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని