Chahal On Virat Kohli: సమస్యేంటంటే.. మనం కోహ్లీ సెంచరీల గురించే ఆలోచిస్తున్నాం..!

సుదీర్ఘకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న టీమిండియా మాజీ కెప్టెన్‌, కీలక బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి

Published : 21 Aug 2022 01:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సుదీర్ఘకాలంగా ఫామ్‌ కోల్పోయి ఇబ్బందులు పడుతోన్న టీమిండియా మాజీ కెప్టెన్‌, కీలక బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విమర్శలపై టీమిండియా లెగ్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ తాజాగా  స్పందించాడు. ఇటీవల కోహ్లీ ఎన్నో విలువైన నాక్స్‌తో జట్టుకు మంచి సహకారం అందించాడని చాహల్‌ అభిప్రాయపడ్డాడు. కానీ, చాలా మంది విరాట్‌ సెంచరీల గురించి ఆలోచించడం వల్లే ఈ సమస్యంతా వస్తోందని అన్నాడు.

తాజాగా ఓ క్రీడాఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన చాహల్‌.. కోహ్లీ ఆటతీరు గురించి స్పందించాడు. ‘‘ఓ ఆటగాడికి టీ20ల్లో 50 కంటే ఎక్కువ సగటు ఉన్నప్పుడు.. రెండు టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైనప్పుడు.. అన్ని ఫార్మాట్లలో కలిపి 70 సెంచరీలు చేసినప్పుడు.. మనం అతడి సగటు రన్‌రేటు ఎలా ఉందనేది మాత్రమే చూడాలి. కానీ.. కోహ్లీ విషయంలో మనం కేవలం అతడి సెంచరీల గురించే ఆలోచిస్తుండటం వల్లే ఈ సమస్యంతా. ఈ మధ్యకాలంలో జట్టుకు అవసరమైనప్పుడు 60-70 పరుగులతో అనేక విలువైన నాక్‌లు ఆడి మంచి సహకారం అందించాడు. దాని గురించి మనం మాట్లాడట్లేదు’’ అని చాహల్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కోహ్లీ క్రీజులో పాతుకుపోతే బౌలింగ్ చేయడానికే చాలా మంది భయపడతారని చాహల్‌ ఈ సందర్భంగా అన్నాడు. ‘‘కోహ్లీ క్రీజులో ఉండి 15-20 పరుగులు చేసిన తర్వాత అతడికి బాల్‌ వేయడానికి ఏ బౌలర్‌ ఇష్టపడడు’’ అని చెప్పుకొచ్చాడు.

అనంతరం కెప్టెన్సీ మార్పు గురించి కూడా చాహల్‌ స్పందించాడు. కెప్టెన్‌ ఎవరైనా తన పాత్ర ఒకేలా ఉంటుందని అన్నాడు. ‘‘కెప్టెన్లు నన్ను ఒక వికెట్ తీసుకునే బౌలర్‌గానే ఉపయోగించుకుంటారు. అక్కడ ఎవరున్నా నాకు ఒకటే. బౌలర్‌గా నాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. పరిస్థితులను బట్టి అవసరమైతే బౌలర్ల సహకారం తీసుకుంటారు’’ అని తెలిపాడు.

కోహ్లీ బ్యాటింగ్‌పై గత కొంతకాలంగా విమర్శలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. 2019 నవంబరు తర్వాత నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని విరాట్‌.. అర్ధసెంచరీలకు కూడా కష్టపడాల్సి వస్తోంది. దీంతో అతడు విరామం తీసుకోవాలంటూ పలువురు విదేశీ దిగ్గజాలు ఇటీవల సూచనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే చాహల్‌ స్పందించాడు. ఇక, కోహ్లీతో చాహల్‌కు మంచి అనుబంధం ఉంది. టీ20 మెగా లీగ్‌లోనూ బెంగళూరు జట్టుకు కోహ్లీ సారథిగా ఉన్నప్పుడు చాహల్‌ 8ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించాడు. త్వరలోనే వీరిద్దరూ ఆసియా కప్‌ 2022 టోర్నీలో మరోసారి కలిసి ఆడనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని