Liger: ‘బాయ్‌కాట్ లైగర్‌’ ట్రెండ్‌పై విజయ్‌ దిమ్మతిరిగే రిప్లై.. ఎదురొస్తే కొట్లాడటమే!

సినిమాను ఆదరించే ప్రజలు, ప్రేక్షకులు ఉన్నంతకాలం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కథానాయకుడు విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) అన్నారు

Published : 21 Aug 2022 01:31 IST

విజయవాడ: సినిమాను ఆదరించే ప్రజలు, ప్రేక్షకులు ఉన్నంతకాలం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని కథానాయకుడు విజయ్‌ దేవరకొండ (Vijay devarakonda) అన్నారు. ఆయన హీరోగాగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌  చిత్రం ‘లైగర్‌’ (liger). శనివారం ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక గుంటూరులో ఏర్పాటు చేశారు. అంతకన్నా ముందు విజయవాడకు వచ్చిన ‘లైగర్‌’ టీమ్‌ విలేకరులతో మాట్లాడింది. ఈ సందర్భంగా ‘బాయ్‌కాట్‌ లైగర్‌’అంశంపై విలేకరులు ప్రశ్నించగా, విజయ్‌ స్పందించారు.

‘‘మూడేళ్ల కిందట సినిమా మొదలు పెట్టాం. అప్పటికి ‘బాయ్‌కాట్‌’ గొడవలేమీ లేవు. దేశవ్యాప్తంగా ‘లైగర్‌’ను తీసుకెళ్లాలంటే కరణ్‌జోహార్‌ కన్నా మించినవారు లేరు. ఆయన ‘బాహుబలి’లాంటి చిత్రాన్ని అక్కడి వారికి చేరువయ్యేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఉత్తరాదిలో మనకు ఆయన దారి చూపించారు. ‘లైగర్‌’ స్క్రిప్ట్‌ మనది, ప్రొడక్షన్‌ మనది. ‘హిందీలో మీరు విడుదల చేయండి’ అని ఆయన చెబితే, ఈ సినిమా బాధ్యత తీసుకున్నారు. అసలు బాలీవుడ్‌లో ఏం గొడవ జరిగిందో పూర్తిగా నాకు తెలియదు. మేము కరెక్ట్‌గానే ఉన్నాం. నేను హైదరాబాద్‌లో పుట్టా. ఛార్మి పంజాబ్‌లో పుట్టింది. పూరి సర్‌ నర్సీపట్నంలో పుట్టారు. మూడేళ్లు కష్టపడి సినిమా తీశాం. మేం సినిమా రిలీజ్‌ చేసుకోకూడదా? ఇంట్లో కూర్చోవాలా? ప్రమోషన్స్‌లో భాగంగా ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రజలు ప్రేమిస్తున్నారు. వాళ్ల కోసం మేం ఈ సినిమా చేశాం. మనవాళ్లు మనకు ఉన్నంత సేపూ భయపడాల్సిన అవసరం లేదు. మన ధర్మం మనం పాటించినప్పుడు ఎవరి మాటా వినాల్సిన పనిలేదు’’

‘‘ఏది ఎదురొచ్చినా కొట్లాడటమే. ఈ దేశం, ఈ ప్రజల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. కంప్యూటర్‌ ముందు కూర్చొని ట్వీట్లు కొట్టే బ్యాచ్‌ కాదు మేము. ఏదైనా జరిగితే ముందడుగు వేసేది మనమే. లాక్‌డౌన్‌ సమయంలో నేను మొదలు పెట్టిన ‘మిడిల్‌క్లాస్‌ ఫండ్‌’ కోసం ఎంతో మంది విరాళం ఇచ్చారు. అలాంటి వాళ్లు మనకు కావాలి. ఎవరో పైకి వెళ్తుంటే కాళ్లు పట్టుకుని కిందికి లాగే వాళ్లు మనకు వద్దు.. అందరి ప్రేమ ఉందని నేను అనుకుంటున్నా. అసలు ‘లైగర్‌’ కథేంటో తెలుసా? ఒక అమ్మ, తన బిడ్డను ఛాంపియన్‌ చేసి, జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్న కథతో సినిమా తీస్తే బాయ్‌కాట్‌ చేస్తారా. ఇలాంటి ఏమనాలో నాకే అర్థం కావటం లేదు’’ అంటూ విజయ్‌ అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘లైగర్‌’ ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని