కొడుకు కోసం తుక్కుతో వాహనం.. ఎక్చ్సేంజీలో బొలెరో ఆఫర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా!

సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. అలాంటి ప్రతిభ గల వ్యక్తుల గురించి తన ట్విటర్

Updated : 23 Dec 2021 04:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సృజనాత్మకత, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో ముందుంటారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా. అలాంటి ప్రతిభ గల వ్యక్తుల గురించి తన ట్విటర్ ఖాతాలో షేర్‌ చేస్తూ వారి నైపుణ్యాలను బయటి ప్రపంచానికి తెలిసేలా చేస్తారు. అంతటితో ఆగకుండా వారికి తనవంతు సాయం అందిస్తారు. తాజాగా మరోసారి అది రుజువైంది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి తన కొడుకు కోరిక తీర్చేందుకు తుక్కుతో ఓ వాహనం తయారుచేశారు. ఆయన క్రియేటివిటీని మెచ్చుకున్న మహీంద్రా.. ఆ వాహనాన్ని తనకు ఇస్తే అందుకు బదులుగా బొలెరో ఇస్తానంటూ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు.

మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లా దేవ్‌రాష్ట్రే గ్రామానికి చెందిన దత్తాత్రేయ లోహర్‌.. స్థానికంగా కంసాలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన కొడుక్కి కారు ఎక్కాలని చిన్నప్పటి నుంచి కోరిక. అయితే అంత స్తోమత లేని దత్తాత్రేయ.. తుక్కు వాహనాల విడి భాగాలు సేకరించి సొంతంగా వాహనం తయారుచేశారు. కిక్‌ ఇస్తే స్టార్ట్‌ అయ్యేలా దీన్ని తయారుచేశారు. సాధారణంగా ఈ మెకానిజంను బైక్‌లలో చూస్తుంటాం. అంతేగా, దత్తాత్రేయ తయారుచేసిన వాహనంలో స్టీరింగ్‌ ఎడమవైపున ఉండటం విశేషం. 

ఈ వాహనం గురించి ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌ వీడియో చేసింది.  తాజాగా ఇది ఆనంద్‌ మహీంద్రా దృష్టిలో పడింది. ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన మహీంద్రా.. ‘‘ఇది ఆటోమొబైల్ నిబంధనలను అందుకోవడం లేదని తెలుసు. కానీ, మన ప్రజల తెలివితేటలు, తక్కువ వనరులతో ఎక్కువ పనిచేసే సామర్థ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. ఇక వాహనాలపై వారికున్న అభిరుచి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు’’ అని రాసుకోచ్చారు.

ఈ ట్వీట్ చేసిన కాసేపటికే మరో ట్వీట్‌ చేసిన మహీంద్రా.. దత్తాత్రేయకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ‘‘నిబంధనలకు అనుగుణంగా లేని కారణంగా స్థానిక అధికారులు ఇప్పుడైనా, తర్వాతైనా ఈ వాహనాన్ని రోడ్డుపైకి రాకుండా అడ్డుకుంటారు. ఈ వాహనాన్ని నాకు ఇస్తే అందుకు బదులుగా బొలెరో వాహనాన్ని ఇస్తాను. ఆయన సృజనాత్మకతను మా మహీంద్రా రీసర్చ్‌ వ్యాలీలో ప్రదర్శనకు ఉంచుతాం. అది మాలో స్ఫూర్తి నింపుతుంది’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. మహీంద్రా ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దత్తాత్రేయ టాలెంట్‌ను పలువురు అభినందిస్తున్నారు. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని