ఏసీలు కొంటున్నారా.. ఇవి చూసుకోండి!

వేసవి వచ్చేసింది. ఎండ, ఉక్కపోత మొదలైంది. ఆ ఇబ్బందిని అధిగమించేందుకు ప్రజలు ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు ఏసీలపై ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో....

Updated : 28 Mar 2021 17:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వేసవి వచ్చేసింది. ఎండ, ఉక్కపోత మొదలైంది. ఆ ఇబ్బందిని అధిగమించేందుకు ప్రజలు ఏసీలు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు ఏసీలపై ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ లాంటి ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లలో వాటి విక్రయాలు జోరందుకున్నాయి. అయితే ఆన్‌లైన్‌లో వాటిని కొనేముందు ప్రస్తుత ఆఫర్లు, వాటి మోడల్‌ నంబర్లు, వారంటీ తదితరాలను చూసి కొనాలని నిపుణులు సూచిస్తున్నారు.

* ఏ కంపెనీకి చెందిన ఏసీ తీసుకోవాలో నిర్ణయించుకున్నాక దాని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఏసీ మోడల్‌, దాని ప్రత్యేకతలు తెలుసుకోవడం తప్పనిసరి. అన్నీ చూసుకున్న తర్వాతే ఆ ఏసీ కొనాలో లేదో నిర్ణయించుకుంటే మంచిది.

* ధరల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఒక ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌లో ఉన్న ధర మరో వెబ్‌సైట్‌లో ఉండకపోవచ్చు. హెచ్చుతగ్గులు ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో వెబ్‌సైట్లోతో పోలిస్తే డీలర్‌ షాపుల్లో ధరలు తక్కువగా ఉంటాయి. ఆ బ్రాండ్‌ వెబ్‌సైట్‌లో ధర ఎంత ఉందో చూసుకోవాలి. ధర ఎక్కడ తక్కువగా ఉందో అక్కడే కొంటే డబ్బు ఆదా చేసుకోవచ్చు.

* ఏ వస్తువు కొన్నా దాని వారెంటీ చూసుకోవడం తప్పనిసరి. ఏసీలు కొనే సమయంలోనూ దాని వారెంటీ చూసుకోవాలి. ఏసీ, కండెన్సర్, కంప్రెషర్‌లు వారెంటీతో వస్తాయి. కంపెనీలు ఏసీ బాడీ, కండెన్సర్‌పై సంవత్సరం, కంప్రెషర్‌పై 5 సంవత్సరాల వారంటీ ఇస్తాయి. కాబట్టి ఏసీ కొనే ముందు వారెంటీ చూసుకోవాలి. ఆ వారెంటీని ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలో కూడా ముందుగానే తెలుసుకోవాలి.

* డెలివరీ, సంస్థాపన(ఇనిస్టలేషన్‌) ఛార్జీల గురించి ముందుగానే తెలుసుకోవాలి. చాలావరకు డెలివరీ ఛార్జీలు ఉచితంగానే ఉంటాయి. కానీ ఏసీ భారీ వస్తువు కాబట్టి డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తారు. కొన్ని సంస్థలు సంస్థాపన కూడా ఎలాంటి రుసుము లేకుండా చేస్తాయి. కానీ కొన్ని సంస్థలు రూ.1600 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తున్నాయి. కాబట్టి ఈ ఛార్జీల గురించి ముందుగానే తెలుసుకోవాలి.

* ప్రస్తుతం అందరూ స్ల్పిట్‌ ఏసీల వైపే మొగ్గుచూపుతున్నారు. కానీ విండో ఏసీలు కొంటేనే ఉపయుక్తం. ఈ ఏసీ పెట్టుకునేందుకు అనువైన కిటికీ ఉంటే వీటినే కొనాలని నిపుణులు సూచిస్తున్నారు. ధర తక్కువగా ఉండటంతోపాటు స్ల్పిట్‌ ఏసీలతో పోలిస్తే సర్వీస్‌, ఇనిస్టలేషన్‌ ఛార్జీలు తక్కువ. ఇనిస్టలేషన్‌ చేసుకోవడం కూడా ఈజీనే.

* ఇన్వర్టర్ ఏసీల్లో మోటారు వేగాన్ని నియంత్రిస్తూ ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకునే వీలుంటుంది. కానీ ఫిక్స్‌డ్‌ స్పీడ్‌ ఏసీల్లో ఈ వెసులుబాటు ఉండదు. ఆన్‌, ఆఫ్‌ మాత్రమే ఉంటాయి. ప్రతిసారీ ఆన్‌, ఆఫ్‌ చేయడం వల్ల ఫిక్స్‌డ్‌ స్పీడ్‌ ఏసీలు ఎక్కువ విద్యుత్తును వినియోగించుకుంటాయి. ఫిక్స్‌డ్‌ స్పీడ్‌ ఏసీలతో పోలిస్తే ఇన్వర్టర్‌ ఏసీల విద్యుత్తు వినియోగం తక్కువ. కానీ వీటి సర్వీసింగ్‌ ఛార్జీలు భారీగా ఉంటాయి. తక్కువ బడ్జెట్‌లో ఏసీ కొనాలనుకుంటే ఫిక్స్‌డ్‌ స్పీడ్‌ ఏసీల వైపు మొగ్గుచూపడమే మంచిది.

* ఏసీ గాలి ఎక్కడ వీస్తోంది అనేది అతి ముఖ్యమైన అంశం. కొన్ని ఏసీలు గాలి దగ్గరగా వీస్తే, మరికొన్ని మోడళ్లు దూరంగా వీస్తాయి. గదిలోని బెడ్‌, సోఫా, కుర్చీలు ఉండే ప్రాంతాన్ని బట్టి గాలి దగ్గరగా వీచే ఏసీ కొనాలో, దూరంగా వీచే మోడల్‌ కొనాలో నిర్ణయించుకోవాలి. రూమ్‌ విస్తీర్ణానికి సరిపడే ఏసీనో కాదో కూడా చూసుకోవాలి.

* కొన్ని తక్కువ ధర మోడళ్లకు కాపర్‌ పైపులు చిన్నవిగా ఉంటాయి. ఇనిస్టలేషన్‌ సమయంపై ఏసీని బహిరంగ యూనిట్‌కు అనుసంధానించే క్రమంలో మరింత కాపర్‌ పైపు అవసరం పడొచ్చు. ఇందుకు అదనంగా వెచ్చించాల్సి వస్తుంది. ఏసీ కొనేముందు అదనపు కేబుళ్లు, కనెక్టర్ల ఛార్జీలను కూడా పరిగణించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని