Telangana News: తెలంగాణలో ఏం చేస్తే దేశమంతా అదే..: హరీశ్‌రావు

రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు నలుదిక్కులా మూడు ఆస్పత్రులకు భూమిపూజ చేసిన ఇవాళ సువర్ణ దినమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Published : 26 Apr 2022 14:42 IST

హైదరాబాద్‌: రాబోయే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కు నలుదిక్కులా మూడు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమిపూజ చేసిన ఇవాళ సువర్ణ దినమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశానికి స్వాత్రంత్యం వచ్చినప్పటి నుంచి జనాభా బాగా పెరిగిందని.. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రుల గురించి గత ప్రభుత్వాలు ఆలోచించలేదని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు ఆస్పత్రులు పుట్టుకొచ్చాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల గురించి నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. నగరంలో ఎల్బీనగర్‌, అల్వాల్‌, ఎర్రగడ్డలలో మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్‌ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా భూమి పూజలో పాల్గొన్న అనంతరం హరీశ్‌రావు అల్వాల్‌లో మాట్లాడారు.

‘‘పెరుగుతున్న అవసరాలు ఓ వైపు, మరో వైపు కరోనా లాంటి పరిస్థితులు, గుండె, కిడ్నీ జబ్బులు పెరుగుతున్నాయి. వరంగల్‌ హెల్త్‌సిటీతో కలిపి దాదాపు 7,500 పడకలు అందుబాటులోకి రానున్నాయి. మూడు టిమ్స్‌లలో 3వేల ఐసీయూ పడకలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. జంట నగరాలకే పరిమితం కాకుండా చుట్టు పక్కల ఉన్న జిల్లాలకు ఇది ఉపయోగపడనుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు కావాలని కొట్లాడినా ఆంధ్ర ప్రాంతంలోనే పెట్టారు. 1956 నుంచి 2014 వరకు మూడే వైద్యకళాశాలలు వచ్చాయి. కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశానికే ఆదర్శంగా జిల్లాకు ఒకటి చొప్పున 33 ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రకటించారు. రాబోయే రెండేళ్లలో ఈ మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి.

గతంలో బెంగాల్‌ ఏం చేస్తే దేశమంతా అదే చేస్తుందనే నానుడి ఉండేదని.. ఇప్పుడు తెలంగాణ ఏం చేస్తే దేశం అదే అనుసరిస్తోందనే నానుడి నిజం అవుతుంది. కేసీఆర్‌ రైతుబంధు ప్రారంభిస్తే దేశమంతా అలాంటి పథకం వచ్చింది. దేశానికి ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలబడుతున్నాం. కొంతమంది నాయకులకు కనీస సోయి కూడా లేదు. హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు సూపర్‌హిట్‌ అయ్యాయి. 15వ ఆర్థిక సంఘం కూడా బస్తీ దవాఖానాలను కొనియాడింది. ఏడేళ్లలోనే డయాలసిస్‌ సెంటర్లను 3 నుంచి 102కి పెంచాం’’ అని హరీశ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని