Andhra Pradesh: ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక ఇస్తాం: సజ్జల

ఉద్యోగ సంఘాల నేతలతో రెండు రోజులుగా సుదీర్ఘంగా చర్చలు జరిపామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలు, మంత్రుల కమిటీ కలిసి ఉమ్మడిగా మీడియా...

Updated : 06 Feb 2022 05:33 IST

అమరావతి: ఉద్యోగ సంఘాల నేతలతో రెండు రోజులుగా సుదీర్ఘంగా చర్చలు జరిపామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగ సంఘాలు, మంత్రుల కమిటీ కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ... అన్ని సంఘాల నేతలతో వివరంగా మాట్లాడామన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగాలేక ఉద్యోగులు కోరిన పీఆర్సీ ఇవ్వలేకపోయామని చెప్పారు. కొన్ని డిమాండ్ల వల్ల చర్చలు ఆలస్యమయ్యాయని పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశంపై లోతుగా చర్చించామని తెలిపారు. ఉద్యోగులు, ప్రభుత్వం ఒక కుటుంబంలా ఉండాలన్నారు. ఉద్యోగులు సంతృప్తి చెందాలని సీఎం పదే పదే చెప్పారని వివరించారు. ఉద్యోగ సంఘాలకు పీఆర్సీ నివేదిక ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇస్తున్నామని, ఉద్యోగ సంఘాలు కోరినట్లు హెచ్‌ఆర్‌ఏ స్లాబుల్లో మార్పులు చేశామని వివరించారు. సచివాలయం, హెచ్‌వోడీ ఉద్యోగులకు 24శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామన్నారు. ఐఆర్‌ రికవరీ ప్రతిపాదన ఉపసంహరిస్తున్నామని సజ్జల స్పష్టం చేశారు. 

ఇక నుంచి ఐదేళ్లకు ఒకసారి పీఆర్సీ నివేదిక ఇస్తామని తెలిపారు. సీసీఏ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సీపీఎస్‌ సమస్యను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని సీఎం కోరారన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు. ఆర్టీసీకి సంబంధించి కొన్ని జీవోలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. ఇచ్చిన, ఇవ్వని అనేక హామీలను ఈ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. జీతాలు పెంచడం వల్ల మూడు లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి కలిగిందని వివరించారు. కరోనా వల్ల రెండేళ్లుగా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని