Lok Sabha: తెలుగు రాష్ట్రాల అప్పుల వివరాలు బయటపెట్టిన కేంద్రం

ఏపీలో అప్పుల వివరాలను కేంద్రం వెల్లడించింది. ఏటేటా రుణభారం పెరిగిపోతున్నట్టు గణాంకాలు విడుదల చేసింది.

Updated : 19 Dec 2022 17:26 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అప్పుల భారం పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  రాష్ట్రాల్లో అప్పులపై భారాస ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు కేంద్రం సమాధానమిచ్చింది. దేశంలోని రాష్ట్రాల వారీగా అప్పుల జాబితాను కేంద్రం బయటపెట్టింది. ఏపీలో ఏటేటా అప్పులు భారీగా పెరిగినట్టు పేర్కొంది. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29లక్షల కోట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఆ రుణం రూ.3.98లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. అదే 2017-18లో గతంతో పోలిస్తే 9.8శాతం అప్పులు తగ్గాయని కేంద్రం పేర్కొంది.  2020-21 నాటికి అప్పులు 17.1శాతం పెరుగుదల నమోదైనట్టు తెలిపింది. ఏపీ జీడీపీలోనూ మూడేళ్లుగా అప్పుల శాతం పెరిగినట్టు వెల్లడించింది.  2014లో రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం 42.3శాతంగా ఉన్నట్టు పేర్కొన్న కేంద్ర ఆర్థికశాఖ..  2014 తర్వాత రాష్ట్ర జీడీపీలో అప్పుల శాతం తగ్గిందని తెలిపింది.  2015లో రాష్ట్ర జీడీపీలో 23.3శాతం అప్పులు ఉండగా.. 2021 నాటికి అది 36.5శాతానికి పెరిగినట్టు వెల్లడించింది.

తెలంగాణలో ఇలా..

మరోవైపు, తెలంగాణలోనూ అప్పుల భారం పెరుగుతోందని తెలిపింది. 2018లో రూ.1.60లక్షల కోట్లుగా ఉన్న అప్పులు 2022 నాటికి రూ.3.12లక్షల కోట్లకు చేరాయంది. 2017-18లోనే 95.9 శాతం అప్పులు నమోదైనట్టు తెలిపింది. 2017-18 నాటికి గతంతో పోలిస్తే 18.7 శాతం అప్పులుంటే.. 2021-22నాటికి 16.7 శాతంగా ఉన్నట్టు స్పష్టంచేసింది.  రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలోనూ గత మూడేళ్లుగా అప్పుల శాతం పెరుగుతూ పోతోందని కేంద్రం తెలిపింది.  2016లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో అప్పుల శాతం 15.7 ఉండగా ఆ తరువాత భారీగా పెరుగుదల నమోదైనట్టు వెల్లడించింది. 2022 నాటికి తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తిలో 27.4 శాతం అప్పులు నమోదయ్యాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని