Published : 08 Dec 2020 02:37 IST

వర్డ్‌ ఆఫ్ ది ఇయర్‌: ‘పాండెమిక్‌’ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. గతేడాది చైనాలో పుట్టిన వైరస్‌.. ఈ ఏడాది పొడవునా విజృంభిస్తూనే ఉంది. గత మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఈ కరోనా వైరస్‌ను ‘గ్లోబల్‌ పాండెమిక్‌’గా ప్రకటించింది. అయితే, తాజాగా ఆ ‘పాండెమిక్‌’ పదం ప్రముఖ డిక్షనరీ ‘మరియం - వెబ్‌స్టర్‌’లో వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది. ఏటా అత్యధిక మంది ఉపయోగించిన పదాల్లో ఒక దాన్ని వర్డ్‌ ఆఫ్ ది ఇయర్‌గా ఈ సంస్థ ప్రకటిస్తుంటుంది. 2020 ఏడాదికి గానూ ‘పాండెమిక్‌’ నిలిచినట్లు ఇటీవల ‘మరియం-వెబ్‌స్టర్‌’ వెల్లడించింది. 

మార్చిలో కరోనా వైరస్‌ తీవ్రత తెలియడంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తమైంది. వైరస్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి వెల్లడిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే వైరస్‌ వ్యాప్తిని ‘పాండెమిక్‌’గా పేర్కొంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ పాండెమిక్‌ పదం బాగా ట్రెండ్‌ అయింది. ఈ ఏడాదిలో ఎక్కువగా ఉపయోగించిన పదంగా మారిపోయింది. నిజానికి డబ్ల్యూహెచ్‌వో ప్రకటనకు ముందే ‘మరియం-వెబ్‌స్టర్‌’ వెబ్‌సైట్‌లో క్రూజ్‌ ఓడల్లో వైరస్‌ బయటపడినప్పుడు, తొలిసారి అమెరికాలో కరోనా వల్ల మరణం సంభవించినప్పుడే పాండెమిక్‌ పదం ట్రెండింగ్‌లోకి వచ్చిందట. గతేడాది మార్చితో పోలిస్తే.. ఈ ఏడాది మార్చిలో పాండెమిక్‌ పదం గురించి ఇంటర్నెట్‌లో 1,15,806శాతం ఎక్కువగా ఆన్వేషించారట. ఇప్పటికీ పాండెమిక్‌పై ఇంటర్నెట్‌లో అన్వేషణ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.

పాండెమిక్‌కు అర్థం

మరియం-వెబ్‌స్టర్‌ డిక్షనరీ ప్రకారం.. పాండెమిక్‌ అంటే ‘విస్తృత భౌగోళిక ప్రాంతాల్లో సంభవించే వ్యాధి వ్యాప్తి. జనాభాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది’అని అర్థం. ఈ పాండెమిక్‌ పదం లాటిన్‌-గ్రీక్‌ నుంచి వచ్చింది. ‘పాన్‌’ అంటే అందరు, ‘డెమోస్‌’ అంటే ప్రజలు. రెండు కలిపితే ‘ప్రజలందరికీ’ అనే అర్థం వస్తుంది. 17వ శతాబ్దంలో ఈ పదాన్ని ‘సార్వత్రిక’ అనడానికి ఉపయోగించేవారట. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్లేగు ప్రబలినప్పటి నుంచి పాండెమిక్‌ పదాన్ని వైద్యరంగంలో విసృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ కరోనా కారణంగా ఇప్పుడు ఈ పదం ప్రజల నోటిలో నిత్యం నానుతోంది. అందుకే వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచింది.

పోటీ పడ్డ మరిన్ని పదాలు

పాండెమిక్‌తోపాటు ‘కొవిడ్‌ 19‘, ‘కరోనా వైరస్‌’, ‘క్వారంటైన్‌’, ‘అసింప్టమాటిక్‌’ పదాలు పోటీలో నిలబడ్డాయి. వీటితోపాటు మాంబా (అమెరికన్‌ బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు కోబ్‌ బ్రయంట్‌ ముద్దు పేరు బ్లాక్‌ మాంబా. ఆయన మరణానంతరం), క్రాకెన్‌ (సియటెల్‌ జాతీయ హకీ లీగ్‌ ఫ్రాంఛైజీ తమ జట్టుకు పౌరాణిక సముద్ర రాక్షసుడు ‘క్రాకెన్‌’ పేరు పెట్టిన అనంతరం), యాంటెబెల్లమ్ (ప్రముఖ మ్యూజిక్‌ గ్రూప్‌ ‘లేడీ యాంటెబెల్లమ్‌’ తమ గ్రూప్‌ పేరును ‘లేడీ ఏ’గా మార్చిన అనంతరం), మాలకీ (అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌ తరచూ ఉపయోగించే పదం. దీనికి అర్థం ‘పిచ్చి మాటలు’), ఐకాన్‌ (అమెరికా నేత జాన్‌ లూయిస్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రుత్‌ బాడర్‌ గిన్స్‌బర్గ్‌ మరణానంతరం)పదాలు వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ రేసులో నిలిచాయి. గత నెలలో కొల్లిన్స్‌ డిక్షనరీ ‘లాక్‌డౌన్‌’ పదాన్ని వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని