Mann Ki Baat: 100 ఎపిసోడ్‌ల ‘మన్‌ కీ బాత్‌’.. ప్రధాని మోదీ నోట.. తెలుగు ఘనకీర్తి మాట!

2014 అక్టోబర్‌ 3న విజయదశమి నాడు ప్రారంభించిన ఆ కార్యక్రమం ఈనెల 30వ తేదీతో 100వ సంచికను పూర్తి చేసుకోబోతోంది.ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది.

Updated : 28 Apr 2023 21:01 IST

ఈనెల 30తో 100 ఎపిసోడ్‌లు పూర్తి

 ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న కేంద్రం

ఈనాడు-దిల్లీ: ప్రతినెలా చివరి ఆదివారం ఉదయం 11 గంటలవుతూనే గుర్తుకొచ్చే కార్యక్రమం ప్రధానమంత్రి మన్‌ కీ బాత్‌ (Mann Ki baat). 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ (PM Modi) ప్రజలతో ఏదో ఒక రూపంలో నిరంతరం సంప్రదింపులు జరిపి తన మనసులోని భావాలను వ్యక్తీకరించడానికి ఏర్పాటు చేసుకున్న వినూత్న కార్యక్రమం ఇది. టీవీ ప్రపంచం ముందు రేడియో (Radio) వెలవెలబోతున్న తరుణంలో ఆయన ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఆకాశవాణిని ఎంచుకొని అందరి దృష్టినీ ఆకర్షించారు. 2014 అక్టోబర్‌ 3న విజయదశమి నాడు ప్రారంభించిన ఆ కార్యక్రమం ఈనెల 30వ తేదీతో 100వ సంచికను పూర్తి చేసుకోబోతోంది. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్ష హోదాలో బరాక్‌ ఒబామా పాల్గొన్నారు. 2015 జనవరి 27న ప్రసారమైన కార్యక్రమంలో ఆయన ప్రధానమంత్రితో కలిసి కూర్చొని ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 100వ ఎపిసోడ్‌ను అట్టహాసంగా నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో ప్రముఖ చలనచిత్ర నటులు అమీర్‌ఖాన్, రవీనా టాండన్‌తోపాటు వివిధ రంగాల ప్రముఖులు కిరణ్‌ బేది, మోహన్‌దాస్‌ పాయ్, రికీ కేజ్, దీపా మాలిక్, ఆర్‌జే రౌనక్, సిద్‌ కన్నన్‌ పాల్గొననున్నారు.ఈ సందర్భంగా నారీశక్తి, వికాస్‌కా ఉత్థాన్, జన్‌సమ్మాన్‌ సే ఆత్మ నిర్భరత, ఆవాహన్‌ సే జన్‌ ఆందోళన్‌ అన్న ఇతివృత్తాలతో నాలుగు వేర్వేరు సెషన్లు నిర్వహిస్తున్నారు. 

ఈనెల 30వ తేదీన ప్రధానమంత్రి ప్రసంగించే 100వ సంచికను ప్రపంచవ్యాప్తంగా వెయ్యి రేడియో కేంద్రాల ద్వారా ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల కార్యదర్శి అపూర్వచంద్ర తెలిపారు. ఇందుకోసం ప్రైవేటు ఎఫ్‌ఎమ్‌ ఛానెళ్లు, కమ్యూనిటీ రేడియోల సేవలనూ ఉపయోగించుకోనున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు ప్రతినెలా ఈ కార్యక్రమాన్ని 23 భారతీయ భాషలు, 31 యాసల్లో అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం చేస్తోంది. వీటికితోడు 11 విదేశీభాషల్లోనూ అనువాదరూపాలను ప్రసారం చేస్తోంది. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొనే ప్రసారభారతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బ్రాడ్‌కాస్ట్‌ ఆడియెన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ టెలివిజన్‌ ఛానల్స్‌ అధ్యయనం ప్రకారం 2018-2020 మధ్యకాలంలో 6 నుంచి 14.35 కోట్లమంది ఈ కార్యక్రమాన్ని టీవీల్లో వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన నాటినుంచి 2022 అక్టోబర్‌ నాటికి మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రసారభారతికి రూ.33.16 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో అత్యధికంగా 2017-18లో రూ.10.58 కోట్లు దక్కింది. ఆ తర్వాతి సంవత్సరాల్లో  క్రమంగా అది తగ్గుతూ వస్తోంది. 

తాజాగా ఐఐఎం రోహ్‌తక్‌ నిర్వహించిన అధ్యయనం ప్రకారం గత 8 ఏళ్లలో ఈ కార్యక్రమం 100 కోట్లమందికి చేరువైంది. దేశంలోని 96% మంది ప్రజలకు ఈ కార్యక్రమం పట్ల అవగాహన ఉంది. ఈ 100వ సంచికకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం రూ.100 నాణెంతోపాటు, ప్రత్యేక తపాలా బిళ్లను కూడా విడుదల చేస్తోంది. ఇప్పటివరకు ఈ 100 సంచికల్లో దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 500 మంది వ్యక్తులు, 250 సంస్థల పేర్లను ప్రధానమంత్రి  ప్రస్తావించారు. అందులో 105 మందిని ప్రత్యేకంగా దిల్లీకి పిలిపించి గౌరవించారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుభాష్‌చంద్ర, సీవీరాజు, ప్రొఫెసర్‌ శ్రీనివాస పదకండ్ల, సాయిప్రణీత్, రామ్‌భూపాల్‌రెడ్డి, కేవీరామసుబ్బారెడ్డి ఉన్నారు. తెలంగాణ నుంచి శ్రీనివాసన్, చింతలవెంకట్‌రెడ్డి, కురెల విఠలాచార్య, మీరా షెనాయ్, పూర్ణా మలావత్, సంతోష్, అపర్ణ వీరు చోటుదక్కించుకున్నారు. మిగతావారిని ఈనెల 30వ తేదీన వారివారి రాష్ట్రాల్లోని రాజ్‌భవన్‌లలో ప్రత్యేకంగా సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర వెల్లడించారు. 

మన్‌కీబాత్‌లో కనిపించిన తెలుగు వెలుగులు

  • 2015 జూన్‌ 28: కర్నూలు జిల్లాలోని బెలుం గుహల అందాల గురించి చెప్పారు. 
  • 2015 అక్టోబర్‌ 25: విజయనగరం జిల్లా ద్వారపూడి పంచాయతీలో పిల్లలే ఉపాధ్యాయులుగా మారి వయోజనులకు అక్షర జ్ఞానం నేర్పించడం గురించి చెప్పారు. ఇందులో అప్పటి కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు భాగస్వాములైనట్లు మోదీ ప్రస్తావించారు.
  • 2015 అక్టోబర్‌ 25: స్వచ్ఛభారత్‌ మిషన్‌ ప్రారంభమైన నాటినుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈటీవీ, ఈనాడు సంస్థలు మనస్ఫూర్తిగా పాలుపంచుకొని ప్రజాచైతన్యం తీసుకొస్తున్నట్లు చెప్పారు. రామోజీ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు వయసు మీదపడుతున్నా ఏ యువతనైనా ఢీకొట్టేంత ఉత్సాహంతో ఉన్నట్లు ప్రశంసించారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ఆయన తన వ్యక్తిగత కార్యక్రమంగా తీసుకున్నట్లు చెప్పారు. ఈటీవీ ద్వారా స్వచ్ఛత గురించి విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ మిషన్‌కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 55-56 వేల పాఠశాలలకు చెందిన 51 లక్షల మంది విద్యార్థులను ఒక్కతాటిపైకి తేవడంలో రామోజీరావు విజయవంతమైనట్లు ప్రశంసించారు. బహిరంగ స్థలాలు, స్టేషన్లు, ధార్మికస్థలాలు, ఆసుపత్రులు, పార్కులు, ఇతర ప్రాంతాలు... ఇలా  స్థలం ఏదైనా ఆయన పరిశుభ్రత ఉద్యమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వార్తలన్నీ భారత్‌ను పరిశుభ్రంగా మార్చాలన్న కలల శక్తిని చాటుతాయని అభిప్రాయపడ్డారు.
  • 2016 జనవరి 31: విశాఖపట్నంలో జరిగే వివిధ రాష్ట్రాల యుద్ధ, సముద్రయాన నౌకల సంగమం ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ గురించి ప్రస్తావించారు. 
  • 2016 మే 22: తెలంగాణలోని రైతు సోదరులు మిషన్‌ భగీరథ ద్వారా కృష్ణా, గోదావరి నీటిని గరిష్ఠస్థాయిలో ఉపయోగించుకొనే ప్రయత్నం చేసినట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నీరు ప్రగతి మిషన్‌ కార్యక్రమం ద్వారా భూగర్భజలాల రీఛార్జ్‌కి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, కరువు నివారణ, పశుసంరక్షణకు సంబంధించిన విషయాల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఈ రాష్ట్రాలు చేసిన అద్భుత ప్రయత్నాలను అన్ని రాష్ట్రాల్లో అమలు చేసేలా నీతి ఆయోగ్‌ చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రిప్‌ ఇరిగేషన్‌లో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లు భారీస్థాయిలో కృషిచేసినట్లు చెప్పారు. ఈ రాష్ట్రాలు యేటా 2 నుంచి 3 లక్షల ఎకరాలను సూక్ష్మసేద్యం కిందికి తేవడానికి శ్రమించినట్లు పేర్కొన్నారు. 
  • 2016 జులై 31: అటవీప్రాంత విస్తరణ గురించి మాట్లాడుతూ అటవీ విస్తరణ కోసం రాష్ట్రాలకు రూ.40వేల కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో పచ్చదనాన్ని 50%మేర పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. 

  • 2016 సెప్టెంబర్‌ 25: ఆంధ్రప్రదేశ్‌ త్వరలో ఓడీఎఫ్‌ లక్ష్యాన్ని చేరుకోబోతున్నట్లు ప్రకటించారు. 
  • 2016 డిసెంబర్‌ 25: డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. ఇదే సమయంలో డిజిటల్‌ చెల్లింపుల విస్తృతి కోసం ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కమిటీ ఈ పథకం కింద విభిన్న కొత్త పథకాలను పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు.
  • 2017 ఫిబ్రవరి 26: వరంగల్‌లో కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్యశాఖ కార్యదర్శి నేతృత్వంలో జరిగిన స్వచ్ఛభారత్‌ సమావేశం జరిగించి చెప్పారు. అందులో 23 రాష్ట్రాల సీనియర్‌ అధికారులు పాల్గొన్నట్లు గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి 17, 18 తేదీల్లో మరుగుదొడ్డిగుంతలను శుభ్రంచేయడం గురించి జరిగిన కసరత్తు గురించి ప్రస్తావించారు. 
  • 2017 మార్చి 26: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
  • 2017 ఏప్రిల్‌ 30: సాంకేతిక పరికరాలను కొంతసేపు పక్కనపెట్టి మీకు మీరు కొంత సమయం కేటాయించుకోవాలని ప్రజలకు సూచించారు. సంగీత వాయిద్యపరికరాలను నేర్చుకోవాలని, తెలుగు, తమిళం లాంటి ప్రాంతీయ భాషల్లో కొన్ని కొత్త పదాలు నేర్చుకోవాలని సూచించారు. 
  • 2017 జూన్‌ 25: విజయనగరం జిల్లాలో 2017 మార్చి 10వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 10గంటల మధ్యలో జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన 71 గ్రామపంచాయతీల్లో 100 గంటల్లో చేపట్టిన 10వేల మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాట్లాడారు. 
  • 2018 మే 27: గ్రామీణ క్రీడల గురించి చెబుతూ ఆంధ్రప్రదేశ్‌లోని గోటిబిల్ల, కర్రబిల్ల గురించి ప్రస్తావించారు.
  • 2018 జులై 29: మహారాష్ట్రలోని పండరిపుర్‌ పాండు రంగదర్శనంకోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పారు.
  • 2019 జూన్‌ 30: తెలంగాణలోని తిమ్మాయిపల్లిలో నిర్మించిన వాటర్‌ ట్యాంక్‌ అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చినట్లు చెప్పారు.
  • 2019 జులై 28: తెలంగాణకు చెందిన పి.అరవింద్‌రావు అనే వ్యక్తి చంద్రయాన్‌-2 గురించి మాట్లాడమని కోరుతూ మైగౌవ్‌ యాప్‌ ద్వారా తనకు లేఖ రాసినట్లు గుర్తుచేశారు.
  • 2019 నవంబర్‌ 24: వచ్చే ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో తుంగభద్ర నదీ పుష్కరాలు జరుగనున్నట్లు చెప్పారు.
  • 2020 ఫిబ్రవరి 23: భారతీయ సంప్రదాయ హస్తకళల గురించి చెబుతూ ఆంధ్రప్రదేశ్‌ లెదర్‌ వర్క్‌ గురించి మాట్లాడారు.
  • 2020 జూన్‌ 28: ఆంధ్రప్రదేశ్‌లో ఆడే సంప్రదాయ ఆట వామనగుంటల గురించి చెప్పారు.
  • 2020 ఆగస్టు8: కృష్ణాజిల్లాలోని కొండపల్లి బొమ్మల గురించి ప్రస్తావించారు. అలాగే విశాఖపట్నానికి చెందిన సీవీరాజు ఏటికొప్పాక బొమ్మలను రక్షిస్తున్న తీరును వివరించారు. చుట్టూ గుండ్రంగా ఉండే ఈ బొమ్మలవల్ల చిన్నారులకు ఎలాంటి గాయాలు కావని, ఇలాంటి బొమ్మలను విస్తృతం చేసేందుకు సీవీరాజు గ్రామంలోని కళాకారులను కలుపుకొని కొత్త ఉద్యమం ప్రారంభించారని చెప్పారు. అత్యుత్తమ బొమ్మల తయారీ ద్వారా రాజు ఆ బొమ్మలకున్న పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నారని అన్నారు.
  • 2020 డిసెంబర్‌ 27: విశాఖపట్నానికి చెందిన వెంకట్‌ రూపొందించిన ఆత్మనిర్భర్‌భారత్‌ చార్ట్‌ గురించి చెప్పారు. మనం రోజువారీ ఉపయోగించే వస్తువుల్లో చాలా వరకు తెలిసో తెలియకో విదేశీ వస్తువులు వాడుతున్నామని, వాటికి ప్రత్యామ్నాయంగా దేశీ వస్తువులు వాడితే ఆత్మనిర్భరత సాధ్యమవుతుందని పేర్కొన్నారని చెప్పారు.

  • 2021 జనవరి 31: కూరగాయల వ్యర్థాల ద్వారా విద్యుత్తు తయారుచేస్తున్న హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కూరగాయాల మండీ గురించి ప్రత్యేకంగా చెప్పారు. 
  • 2021 ఫిబ్రవరి 28: హైదరాబాద్‌కు చెందిన రైతు చింతల వెంకట్‌రెడ్డి గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన మన్‌కీబాత్‌ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన కష్టపడి విటమిన్‌-డితో నిండిన గోధుమ, బియ్యం రకాలను పండించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి తన ప్రసంగంలో హైదరాబాద్‌కు చెందిన అపర్ణారెడ్డి వేసిన ప్రశ్న గురించి ప్రస్తావించారు. 
  • 2021 మార్చి 28: విజయవాడకు చెందిన ప్రొఫెసర్‌ శ్రీనివాస పదకండ్లజీ ఆటోమొబైల్‌ వ్యర్థాలతో కళాఖండాలను సృష్టిస్తున్న తీరు గురించి ప్రస్తావించారు. ఆయన చేసిన భారీ కళాకృతులు పార్కుల్లో ఏర్పాటుచేయడంతో ప్రజలు కూడా ఆసక్తితో తిలకిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్‌ వ్యర్థాలతో కళాఖండాలు తయారుచేయడం సరికొత్త ప్రయోగమని, మరింత మంది ఇలాంటి ప్రయోగాలకు ముందుకురావాలని పిలుపునిచ్చారు. 
  • 2021 జూన్‌ 27: స్వాతంత్రసమరయోధుల గురించి తెలుగుతోపాటు వివిధ భారతీయ భాషల్లో ప్రజలు రచనలు చేస్తున్న విషయం గురించి ప్రస్తావించారు.
  • 2021 జులై 25: ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సాయిప్రణీత్‌ రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణమార్పుల గురించి సమాచారాన్ని అందిస్తున్న విషయాన్ని వెల్లడించారు. 
  • 2021 అక్టోబర్‌ 24: తెలంగాణలో వ్యాక్సిన్లు డ్రోన్లతో తరలించిన విషయం గురించి ప్రస్తావించారు.
  • 2021 డిసెంబర్‌ 26: తెలంగాణకు చెందిన 84 ఏళ్ల డాక్టర్‌ కురెల విఠాలాచార్య గురించి ప్రస్తావించారు. లెక్చరర్‌గా పనిచేసి పదవీవిరమణ చేసిన అనంతరం ఆయన తన సొంత పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, తాను సంపాదించిందంతా దానికోసమే ధారపోసినట్లు కీర్తించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట డివిజన్‌లో ఉన్న ఈ గ్రంథాలయంలో 2 లక్షల పుస్తకాలున్నట్లు తెలిపారు. చదువుకోవడానికి తాను పడ్డ కష్టం మరెవ్వరూ పడకూడదన్న ఉద్దేశంతో విఠలాచార్య ఆ గ్రంథాలయాన్ని ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. పెద్దసంఖ్యలో విద్యార్థులు ఆ గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని ప్రయోజనం పొందడం ఆయనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు. విఠలాచార్య నుంచి స్ఫూర్తి పొందిన ఎంతోమంది తమ గ్రామాల్లోనూ అలాంటివి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ఉదహరించారు. 
  • 2022 మార్చి 27: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పండే బంగినపల్లి, సువర్ణరేఖ రకం మామిడిపండ్ల గురించి ప్రస్తావించారు. ఇక్కడినుంచి అవి దక్షిణ కొరియాకు ఎగుమతి అవుతున్నట్లు పేర్కొన్నారు. అదే సంచికలో సికింద్రాబాద్‌లోని బన్సిలాల్‌పేటలోని మెట్ల బావిని ప్రజా భాగస్వామ్యంతో పునరుద్ధరించిన విషయం గురించి మాట్లాడారు. 
  • 2022 మే 29: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురానికి చెందిన రాంభూపాల్‌రెడ్డి అనే వ్యక్తి ఉద్యోగం నుంచి పదవీవిరమణ చేసిన తర్వాత వచ్చిన డబ్బంతా ఆడపిల్లల చదువుకోసం ధారపోసిన విషయాన్ని ప్రస్తావించారు. సుకన్యసమృద్ధియోజన కింద 100 మంది ఆడపిల్లలకు ఖాతాలు తెరిపించి అందులో రూ.25లక్షలు డిపాజిట్‌చేసిన విషయాన్ని వెల్లడించారు.
  • 2022 జూన్‌ 26: ఇందులో తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణా మలావత్‌ గొప్పతనం గురించి చెప్పారు. 7 సమ్మిట్‌ ఛాలెంజ్‌లు పూర్తిచేయడం ద్వారా ప్రపంచంలో ఏడు అత్యంత క్లిష్టమైన పర్వతాలను అధిరోహించి ఆమె తన మణిమకుటంలో మరో కలికితురాయిని చేర్చుకున్నారని కొనియాడారు. ఆమె తన కఠోరమైన తప్పుతో నార్త్‌ అమెరికాలోని అత్యంత ఎత్తైన మౌంట్‌డెనాలీని అధిరోహించి భారత్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చినట్లు పేర్కొన్నారు. కేవలం 13 ఏళ్ల చిన్నవయస్సులోనే ఎవరెస్ట్‌ శిఖరం ఎక్కిన ఘనత ఈ భరతమాత ముద్దుబిడ్డకు దక్కుతుందని కీర్తించారు. 
  • 2022 జులై 31: తెలంగాణలోని కోయ గిరిజనులు మేడారంలో జరుపుకొనే అతిపెద్ద పండుగ సమక్క, సారలమ్మ జాతర గురించి ప్రస్తావించారు. ఇది తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిపొందిందని, గిరిజన మహిళానాయికలు సమక్క, సారలమ్మ గౌరవార్థం ఆ జాతర జరుపుతారని చెప్పారు. ఇది కేవలం తెలంగాణలోనే కాకుండా ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల్లోని గిరిజనులకూ పెద్ద పండుగ అని చెప్పారు. ఇదే సంచికలో ప్రధాని ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన సమాజం జరిపే మరిడమ్మ జాతర గురించీ చెప్పారు.
  • 2022 ఆగస్టు 28: ఇందులో వరంగల్‌ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మంగ్త్యా-వల్య తాండాలో వర్షాకాలంలో ఎప్పుడూ నీరు నిలిచిపోయే ప్రాంతాన్ని అమృత్‌సరోవర్‌గా తీర్చిదిద్దిన విధానం గురించి చెప్పారు.
  • 2022 సెప్టెంబర్‌ 25: చీతాల గురించి మాట్లాడమని తెలంగాణకు చెందిన రఘురాంతోపాటు చాలామంది తనకు సందేశాలు పంపినట్లు తెలిపారు.
  • 2022 అక్టోబర్‌ 30: నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావదినోత్సవాన్ని జరుపుకోబోతున్నట్లు చెబుతూ అభినందనలు తెలిపారు.
  • 2022 నవంబర్‌ 27: రాజన్నసిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత సోదరుడు యెల్దిహరిప్రసాద్‌ తనకు చేత్తోనేసిన జి-20 లోగోను పంపిన విషయాన్ని వెల్లడించారు. ఆ అద్భుత బహుమతిని చూసి ఆశ్చర్యపోయినట్లు పేర్కొన్నారు. అద్భుతమైన కళాకారుడు తన చేనేత కళతో అందర్నీ ఆకట్టుకున్నట్లు చెప్పారు. తెలంగాణలోని జిల్లాలో కూర్చున్న వ్యక్తికూడా జి-20 లోగోను పంపడం ద్వారా ప్రజలు ఆ సదస్సుతో ఎలా అనుసంధానమయ్యారన్నది అర్థమవుతోందన్నారు.
  • 2023 జనవరి 29: నంద్యాలకు చెందిన కేవీరామసుబ్బారెడ్డి అనే వ్యక్తి తనకున్న మంచి ఉద్యోగాన్ని వదులుకొని చిరుధాన్యాలకు అంకితమైన విధానం గురించి చెప్పారు. ఆయన తన గ్రామంలోనే చిరుధాన్యాల శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసి వాటివల్ల ఉన్న ఉపయోగాల గురించి చుట్టుపక్కల వారికి వివరిస్తున్నట్లు తెలిపారు. అలాగే అందరికీ చిరుధాన్యాలు సులభంగా లభ్యమయ్యేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యర్థాల నుంచి సంపద తయారుచేయడం గురించి మాట్లాడమని తెలంగాణకు చెందిన విజయ్‌ అనే వ్యక్తి తనను కోరినట్లు చెప్పారు.
  • 2023 ఫిబ్రవరి 26: ఆజాదీకా అమృత్‌మహోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన విజయదుర్గ అనే మహిళ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపై రాసిన కవితను చదివి వినిపించారు. ఇందులోనే తెలంగాణకు చెందిన రాజ్‌కుమార్‌ నాయక్‌ తెలంగాణలోని 31 జిల్లాల్లో 101 రోజులపాటు నిర్వహించిన పేరిణి నాట్యం గురించి చెప్పారు. కాకతీయరాజుల కాలంలో ఖ్యాతి పొందిన పేరిణీ నృత్యం ఇప్పటికీ తెలంగాణ మూలాలతో ముడిపడి ఉందని మోదీ కీర్తించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని