జగిత్యాల జిల్లాలో ఒక్క రోజే 546 కేసులు

జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. సోమవారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా 546 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, ఏడుగురు వైరస్‌తో మృత్యువు పాలయ్యారు.

Published : 13 Apr 2021 01:04 IST

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి బుసలు కొడుతోంది. సోమవారం ఒక్క రోజే జిల్లావ్యాప్తంగా 546 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, ఏడుగురు వైరస్‌తో మృత్యువు పాలయ్యారు. గత వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా మొత్తం 3వేల మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్న కోరుట్ల, మెట్‌పల్లి, కొండ్రికర్ల తదితర ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్‌ రవి సోమవారం పర్యటించారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 13 గ్రామాలను కంటైన్మెంట్‌ జోన్లుగా గుర్తించారు. 
మరోవైపు పాజిటివ్‌ వచ్చిన వారు కచ్చితంగా గృహా నిర్బంధంలోనే ఉండాలని, సరైన వసతులు లేని వారిని కొండగట్టు జేఎన్‌టీయూ ఐసోలేషన్‌కు తరలించాలని కలెక్టర్‌ రవి సూచించారు. తీవ్ర అనారోగ్యం ఉన్నారని జిల్లా ఆస్పత్రికి తరలించాలని చెప్పారు. అలాగే కంటైన్మెంట్‌ జోన్లలో అవసరమైన వారికి నిత్యావసరాలను ఇళ్ల వద్దకు పంపించాలని పేర్కొన్నారు. కరోనా జాగ్రత్తలు, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేస్తూ మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తున్నారు. కొండ్రికర్ల గ్రామంలో ద్విచక్రవాహనంపై మాస్కు లేకుండా వెళ్తున్న యువకులను కలెక్టర్‌ స్వయంగా ఆపి రూ.1000 జరిమానా విధించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని