మాయదారి మ్యూటేషన్లు

కరోనా వైరస్‌కు చెందిన కొన్ని మ్యుటేషన్లు (ఉత్పరివర్తనాలు) రోగనిరోధక వ్యవస్థలోని కిల్లర్‌ కణాల నుంచి తప్పించుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రియాలోని మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నాకు చెందిన కొందరు పరిశోధకులు ఈ పరిశోధనలు నిర్వహించారు.

Updated : 07 Mar 2021 05:16 IST

రోగనిరోధక వ్యవస్థ కిల్లర్‌ కణాల నుంచి తప్పించుకుంటున్న వైరస్‌

వియన్నా: కరోనా వైరస్‌కు చెందిన కొన్ని మ్యూటేషన్లు (ఉత్పరివర్తనాలు) రోగనిరోధక వ్యవస్థలోని కిల్లర్‌ కణాల నుంచి తప్పించుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆస్ట్రియాలోని మెడికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ వియన్నాకు చెందిన కొందరు పరిశోధకులు ఈ పరిశోధనలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన పత్రాలు తాజాగా సెల్‌ ఇమ్యునాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా రోగనిరోధక వ్యవస్థలోని టి-కణాలు శరీరంలోని ఇన్ఫెక్షన్‌కు గురైన కణాలను గుర్తించి వాటిని చంపేస్తాయి. కానీ, ఈ కరోనా వైరస్‌కు సంబంధించిన కొన్ని మ్యూటేషన్లు వాటి నుంచి తప్పించుకుంటున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇందులో భాగంగా 750 కరోనా ఉత్పరివర్తనాలపై పరిశోధనలు నిర్వహించామని వారు తెలిపారు. వీటిలో చాలా మ్యుటేషన్లు కిల్లర్‌ కణాల నుంచి తప్పించుకుంటున్నాయన్నారు.

‘‘కొవిడ్‌ సోకిన వ్యక్తుల నుంచి కణాలను సేకరించి బయో ఇన్ఫర్మేటిక్‌, బయో కెమికల్‌ ఇన్వెస్టిగేషన్ల ఆధారంగా పరిశీలిస్తే టి-కిల్లర్‌ కణాల నుంచి ఈ మ్యుటేషన్లు తప్పించుకుంటున్నట్లు గుర్తించాం. మనకు సోకే ఇన్ఫెక్షన్లలో చాలా వాటిని ఈ కిల్లర్‌ కణాలు నిర్మూలిస్తాయి. కానీ, ఈ సార్స్‌-కోవ్‌-2కు చెందిన ఉత్పరివర్తనాల్లో ఆరింటిలో ఒక్కదానినే ఈ కణాలు గుర్తించగలుగుతున్నాయి’’ అని పరిశోధకుల్లో ఒకరైన ఆండ్రియాస్‌ బెర్గ్‌థాలర్‌ తెలిపారు. భవిష్యత్తులో మనం రూపొందించబోయే వ్యాక్సిన్ల విషయలో ఈ ఉత్పరివర్తనాల చర్యలను దృష్టిలో పెట్టుకోవాలని మరో పరిశోధకుడు జోన్స్‌ హుప్పా తెలిపారు. టి- కిల్లర్‌ కణాలను మరింత శక్తిమంతంగా చేసే వ్యాక్సిన్లను రూపొందించాలని ఆయన సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని