Swap Kidney: కిడ్నీ కోసం కిడ్నీ దానం.. దేశ రాజధానిలో అరుదైన ఆపరేషన్లు!

రెండు వేర్వేరు కుటుంబాల్లోని ఇద్దరు వ్యక్తులకు మూత్రపిండాలు (Kidneys) దెబ్బతిన్నాయి. ఫైనల్‌ స్టేజ్‌ కావడంతో.. కిడ్నీ మార్పిడి (Kidney transplant) తప్పనిసరని వైద్యులు పేర్కొన్నారు. దీంతో తమ కిడ్నీ ఇచ్చేందుకు...

Published : 24 Sep 2022 02:13 IST

దిల్లీ: రెండు వేర్వేరు కుటుంబాల్లోని ఇద్దరు వ్యక్తులకు మూత్రపిండాలు (Kidneys) దెబ్బతిన్నాయి. చివరి దశ కావడంతో.. కిడ్నీ మార్పిడి (Kidney transplant) అనివార్యమని వైద్యులు పేర్కొన్నారు. దీంతో తమ కిడ్నీ ఇచ్చేందుకు బాధితుల భార్యలూ ముందుకొచ్చారు. కానీ.. బ్లడ్‌ గ్రూప్‌ సరిపోలకపోవడంతో నిస్సహాయంగా మిగిలిపోయారు. కానీ, అంతలోనే.. వారి కుటుంబాల్లో ఆశలు మళ్లీ చిగురించాయి. కారణం.. ఒక కుటుంబంలోని దాత బ్లడ్‌ గ్రూప్‌.. మరో కుటుంబంలోని బాధితుడి బ్లడ్‌ గ్రూప్‌తో సరిపోలడమే. దీంతో ‘స్వాప్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ (Swap Transplant)’ ద్వారా వైద్యులు ఇద్దరి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి, ప్రాణాలు నిలబెట్టారు. దేశ రాజధాని దిల్లీలో ఇది చోటుచేసుకుంది.

ఆస్పత్రి తెలిపిన వివరాల ప్రకారం.. దిల్లీకి చెందిన రెండు కుటుంబాల్లోని ఇద్దరు వ్యక్తులు చివరి దశ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అప్పటికే.. దాదాపు రెండేళ్లుగా ఇద్దరికీ డయాలసిస్‌ నడుస్తోంది. బ్లడ్ గ్రూప్ మ్యాచ్‌ కాకపోవడంతో.. వారి భార్యలు కిడ్నీ దానం చేయలేని దుస్థితి. అయితే, అవయవ మార్పిడి కోసం బ్లడ్‌ గ్రూప్‌ సరిపోలని దాతలు, రోగుల వివరాలతో ఆస్పత్రి ఓ రిజిస్టర్‌ నిర్వహిస్తుంది. దీని ఆధారంగా.. రెండు కుటుంబాల్లోని దాతలు, బాధితుల బ్లడ్‌ గ్రూప్‌లను పరస్పరం పోల్చి చూశారు.

అంతా సవ్యంగా ఉండటంతో.. ప్రభుత్వ ఆమోదిత ‘స్వాప్‌ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌’ ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇరు కుటుంబాల పరస్పర ఒప్పందం, అవయవదాన కమిటీ అనుమతితో.. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తిచేశారు. ‘రెండు శస్త్రచికిత్సలను ఒకేసారి చేయాల్సి వచ్చింది. మొత్తం ప్రక్రియకు దాదాపు ఏడు గంటలు పట్టింది. సంక్లిష్టమైన ఆపరేషన్‌లు కావడంతో.. మరింత సిబ్బంది, మౌలిక సదుపాయాలు అవసరమయ్యాయి. అంతా సజావుగా జరిగింది. నలుగురూ పూర్తిగా కోలుకుని, ఆసుపత్రి నుండి డిశ్ఛార్జి అయ్యారు’ అని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని