Ap News: కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికకు తొలగిన అడ్డంకి.. ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశాలు

కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను రేపు జరపాలని హైకోర్టు ఆదేశించింది. తెదేపా దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ...

Updated : 23 Nov 2021 15:57 IST

అమరావతి: కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను రేపు జరపాలని హైకోర్టు ఆదేశించింది. తెదేపా దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, విజయవాడ పోలీసు కమిషనర్‌ హైకోర్టుకు రావాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు విచారణకు హాజరయ్యారు. కొండపల్లి మున్సిపల్‌ కమిషనర్‌, రిటర్నింగ్‌ అధికారి, విజయవాడ ఇన్‌ఛార్జ్‌ సీపీ హాజరై కోర్టుకు వివరణ ఇచ్చారు. విచారణ అనంతరం రేపు కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నికను నిర్వహించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఎన్నిక జరిపేలా మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించాలని ఎస్‌ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్లకు రక్షణ కల్పించాలని విజయవాడ సీపీని హైకోర్టు ఆదేశించింది. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక ఫలితం ప్రకటించకుండా వివరాలు హైకోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణ ఈ నెల 25కు వాయిదా వేసింది.

గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు: కేశినేని నాని

కొండపల్లి మున్సిపల్‌ ఎన్నిక జరపాలని హైకోర్టు ఆదేశించిన అనంతరం కొండపల్లి పురపాలక సంఘం నుంచి తెదేపా నేతలు బయటకు వచ్చారు. సమావేశ మందిరం నుంచి ఎంపీ కేశినేని నాని, కౌన్సిలర్లు బయటకు వచ్చారు. కేశినేని మాట్లాడుతూ.. ‘‘ఛైర్మన్‌ ఎన్నిక కోసం ఇప్పటివరకు వేచి చూశాం. కోర్టు ఆదేశాలను మరిచి అధికారులు ఎన్నికను వాయిదా వేశారు. తొలిరోజు భేటీ వాయిదా వేయడమే తప్పు. రెండో రోజు కూడా సమావేశం వాయిదా వేశారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి తలెత్తలేదు. అనేక రకాలుగా ఇబ్బందులతో పాటు ప్రలోభ పెడుతున్నారు. పార్టీకి కట్టుబడి ఉంటామన్న నేతలకు ధన్యవాదాలు. తెదేపా కౌన్సిలర్ల కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు పట్టించుకోవడం లేదు. రేపు ఎన్నిక సజావుగా జరిగేలా పోలీసులు చూడాలి. నిన్నటి పరిణామాలపై వైకాపా సభ్యులపై ఆర్‌వో క్రిమినల్‌ కేసు పెట్టాలి’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని