Chandrababu: ఎట్టి పరిస్థితుల్లో జగన్‌ ఆటలు సాగనివ్వం: చంద్రబాబు

కుప్పం పురపాలిక ఎన్నికల వేళ మున్సిపల్‌ కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపిన తెదేపా నేతలు అమర్నాథరెడ్డి, పులివర్తి నానిల అరెస్టును

Updated : 10 Nov 2021 10:29 IST

అమరావతి: కుప్పం పురపాలిక ఎన్నికల వేళ మున్సిపల్‌ కమిషనర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపిన తెదేపా నేతలు అమర్నాథరెడ్డి, పులివర్తి నానిల అరెస్టును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఖండించారు. ‘‘తెదేపా నేతల అరెస్ట్‌ అప్రజాస్వామికం. కుప్పంలోని హోటల్‌లో నిన్న రాత్రి భోజనం చేస్తున్న వారిని అరెస్టు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. తెదేపా నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎన్నికలను ఏకపక్షం చేసుకోవాలన్నది జగన్‌ ప్రణాళిక. ఎట్టి పరిస్థితుల్లో జగన్‌ ఆటలు సాగబోవు. అక్రమంగా అరెస్ట్‌ చేసిన నేతలను విడుదల చేయాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఈసీ చూడాలి’’ అని చంద్రబాబు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

మరోవైపు కుప్పంలో తెదేపా ప్రచారం అడ్డుకునేందుకు అక్రమ అరెస్టులు చేస్తున్నారంటూ చంద్రబాబు డీజీపీ, ఎస్‌ఈసీలకు లేఖ రాశారు. ‘‘పోలీసుల అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రహసనంగా మార్చారు. తెదేపా అభ్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు. వైకాపాతో కొందరు అధికారులు కుమ్మక్కయ్యారు. తెదేపా అభ్యర్థుల నామినేషన్లను అక్రమంగా తిరస్కరించారు. పోలీసులు కూడా కుమ్మక్కై తప్పుడు ఫిర్యాదులపై అక్రమ అరెస్టులు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలి. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి’’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.

పోలీసుల అదుపులో నిమ్మల రామానాయుడు
కుప్పం మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో బస చేసిన తెదేపా నేత నిమ్మల రామానాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి 12.45కు ఆ హోటల్‌ వద్దకు పోలీసులు వచ్చారు. దీంతో ఆయన వారి వైఖరికి నిరసనగా గదికి తాళం వేసుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం తాళం తీయడంతో అర్ధరాత్రి 1.30కు నిమ్మలను అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని