Telangana: తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడి.. 2,500 మందికి ఉపాధి అవకాశాలు

జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర మంత్రి...

Updated : 15 Sep 2021 20:32 IST

హైదరాబాద్‌: జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన దేశీయ దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో మలబార్ గ్రూప్ అధినేత ఎం.పి అహ్మద్‌తో కూడిన సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమై ఈ మేరకు తమ నిర్ణయాన్ని వెల్లడించింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలతో పాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయన్న కంపెనీ.. ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న స్నేహపూర్వక దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందించింది.

మలబార్‌ గ్రూప్స్‌లో అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని.. తెలంగాణలో ప్రతిపాదిస్తున్న పెట్టుబడి ద్వారా తమ కంపెనీ జ్యువెలరీ తయారీ విభాగం మరింత బలోపేతం అవుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మొత్తం రూ.750 కోట్లు పెట్టుబడిని తెలంగాణలో పెట్టనున్నట్లు తెలిపింది. ఈ పెట్టుబడి ద్వారా గోల్డ్‌, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తమ పెట్టుబడితో సుమారు 2,500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.

తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మాలబార్ గ్రూప్‌ నిర్ణయాన్ని మంత్రి కేటీఆర్ స్వాగతించారు. రాష్ట్రంలో ఈ వృత్తిలో కొనసాగుతూ అద్భుతమైన కళా నైపుణ్యం కలిగిన స్వర్ణకారులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్నారన్నారు. కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణనలోకి తీసుకోవాలని సంస్థను కోరారు. మలబార్ గ్రూప్‌కు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరపున అందజేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని