
Ts News: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు తొలగిన అడ్డంకి
హైదరాబాద్: తెలంగాణలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివిధ శాఖల్లో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2016 ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. ఒప్పంద ఉద్యోగుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ కూడా ప్రారంభించింది. అయితే, జీవోను సవాల్ చేస్తూ నిరుద్యోగులు జె.శంకర్, ఎన్.గోవిందరెడ్డి 2017లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో విచారణ జరిపిన హైకోర్టు ... జీవోపై స్టే ఇస్తూ 2017లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. స్టే వల్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ తుకారాం ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్ కొట్టివేసిన విషయాన్ని పిల్లో ఎందుకు ప్రస్తావించలేదని పిటిషనర్లను హైకోర్టు తప్పుపట్టింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.