Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 06 Dec 2021 09:13 IST

1. Omicron: 6 వారాలు కీలకం
రాష్ట్రంలో వచ్చే ఆరు వారాలు అత్యంత కీలకమని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డాక్టర్‌ జి.శ్రీనివాసరావు సూచించారు. జనవరి 15 తరువాత రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగే అవకాశముందని, ఫిబ్రవరి నాటికి తీవ్రత మరింత ఎక్కువ కావచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రతిఒక్కరూ మాస్కు ధరించాలని సూచించారు. అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరారు. 

2. తెలంగాణలో కొత్తగా 11 ఆటోనగర్‌లు

రాష్ట్రంలో వాహనాల సంఖ్య, క్రయవిక్రయాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఈ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 ఆటోనగర్‌ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌ నుంచి ముంబయి, బెంగళూరు, నాగ్‌పుర్‌ జాతీయ రహదారుల వెంబడి ఒక్కోటి చొప్పున 3, మరో 8 పట్టణాలకు వీటిని మంజూరు చేసింది. జాతీయ రహదారుల వెంబడి యూనిట్లకు 30 ఎకరాలు, పట్టణాల్లో 10 ఎకరాల చొప్పున కేటాయించింది.

3. ఆ ఉద్యోగ ప్రకటనలను నమ్మి మోసపోవద్దు: తితిదే

తితిదేలో ఉద్యోగాల భర్తీ పేరిట సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అవాస్తవ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని తితిదే హెచ్చరించింది. ‘ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు మోసపూరిత మాటలు చెప్పి గతంలో కొంతమంది అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశాం. తితిదేలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టేటప్పుడు ముందుగా పత్రికల్లో, తితిదే వెబ్‌సైట్‌లో అధికారిక ప్రకటన విడుదల చేస్తాం’అని తితిదే స్పష్టం చేసింది.

4.  విపత్తా.. వైఫల్యమా?

అన్నమయ్య, పింఛ జలాశయాల వరద కట్టలు తెగిపోయి పెను విధ్వంసం జరిగిన ఘటనపై ఇంటా బయటా పెనుదుమారం రేగింది. ఈ విషయంలో యంత్రాంగం వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోగా.. ప్రాణనష్టమూ సంభవించింది. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం సంభవించిందన్నది అధికారవర్గాల వాదన. కానీ, జలవనరుల రంగంలో ఉన్న నిపుణుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సామర్థ్యానికి మించిన వరదతోనే డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే ఈ పెను ప్రమాదానికి కారణమని వారు అంటున్నారు.

5. త్వరలో 100 ఈవీ ఛార్జింగ్‌ కేంద్రాలు

ఏపీలో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు దిల్లీ, గుజరాత్‌లకు చెందిన టైరెక్స్‌, స్టాటిక్‌ సంస్థలు ఆసక్తి చూపాయి. జనవరి నాటికి ఈ రెండు సంస్థలు కలిసి కనీసం వంద కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఈ సంస్థలతో నెడ్‌క్యాప్‌ కొద్ది రోజుల్లో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఛార్జింగ్‌ కేంద్రాల ఏర్పాటుకు ఇటీవల నెడ్‌క్యాప్‌ ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన (ఈవోఐ) జారీ చేసింది.

6. ఎంఎంటీఎస్‌ రైళ్ల సమయాల్లో మార్పు

ప్రజా రవాణాలో అతి తక్కువ టిక్కెట్‌ ధరతో అందుబాటులో ఉన్న ప్రయాణ వనరు మరింత పెరిగింది. కేవలం రూ.5 టిక్కెట్‌తో 20 కి.మీ, రూ.10 టిక్కెట్‌తో 40 కి.మీ. ప్రయాణాన్ని అందిస్తున్న ఎంఎంటీఎస్‌ సర్వీసులు సోమవారం నుంచి పెరగనున్నాయి. లింగంపల్లి-ఫలక్‌నుమా, హైదరాబాద్‌-లింగంపల్లి, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ మధ్య నడిచే రైళ్ల సంఖ్య 79కి చేరింది.

7. ‘మాస్క్‌’ ఉల్లంఘనులపై రూ.131 కోట్ల జరిమానాలు

మాస్క్‌ నిబంధనను ఉల్లఘించినవారిపై ఈ-పెట్టీ కేసు నమోదు చేయడంపై పోలీసులు దృష్టి సారించారు. గత ఏడాది మార్చి ఆఖరులో లాక్‌డౌన్‌ అమలైనప్పటి నుంచే మాస్క్‌ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న వారిపై కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌లోని 51 సెక్షన్‌ కింద కేసుల నమోదు ఆరంభించారు. గత ఏడాది 3,26,758 కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది 9,89,340 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు మొత్తం రూ.13,16,098 కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.

8. అవినీతిని సహించొద్దు: ఉపరాష్ట్రపతి

పరిపాలనలో అవినీతిని ఏమాత్రం సహించరాదని, అన్ని స్థాయిల్లో సంపూర్ణ పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజాస్వామ్యానికి అవినీతి చెద పడితే సామాన్యుడికి తీవ్ర నష్టంగా పరిణమిస్తుందన్నారు. ఝార్ఖండ్‌ మాజీ గవర్నర్‌, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ప్రభాత్‌ కుమార్‌ రచించిన ‘పబ్లిక్‌ సర్వీస్‌ ఎథిక్స్‌: ఏ క్వెస్ట్‌ ఫర్‌ నైతిక్‌ భారత్‌’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆదివారం ఆవిష్కరించారు.

9. Omicron: అనంతపురంలో.. ఆ ముగ్గురి పాజిటివ్‌పై ఉత్కంఠ

ఒమిక్రాన్‌.. అనే కొవిడ్‌ వేరియంట్‌ అనంతపురం జిల్లా జనాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. జిల్లా పొరుగున బెంగళూరులో ఇద్దరు వ్యక్తుల్లో ఒమిక్రాన్‌ వైరస్‌ ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే. బెంగళూరు-అనంతకు రాకపోకలు నిత్యకృత్యం. దీంతో ఏ రూపంలోనైనా ఆ మహమ్మారి జిల్లాలోకి ప్రవేశిస్తుందన్న భయం ఆవరించింది. జిల్లావాసులు  ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్‌ విమానాశ్రయాల నుంచి విదేశాలకు వెళ్లి వస్తున్నారు.

10. నాగాల నేలలో కాలకూటం!

నాగాలాండ్‌ వివాదం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఇది భారత నేలపై విషాన్ని చిమ్ముతూనే ఉంది. భారత్‌లో అత్యంత సుదీర్ఘ, రక్తసిక్త ఘర్షణగా ఇది నిలిచిపోయింది. దాడులు, ప్రతిదాడులు, శాంతి చర్చలు, కాల్పుల విరమణల నడుమ ఇది కశ్మీర్‌ వేర్పాటువాదం కన్నా ఎక్కువ కాలం రగిలింది. తాజాగా మాన్‌ ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటనతో నాగా వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. ఆ నెత్తుటి చారికల్ని తడిమిచూసుకునే పరిస్థితుల్ని కల్పించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని