Published : 29/11/2021 20:57 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. యాసంగి ధాన్యం కొనం: సీఎం కేసీఆర్‌

యాసంగిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇక ఉండబోవని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేబినెట్‌ భేటీ అనంతరం ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ‘‘ధాన్యం పండించి రైతులు నష్టపోవద్దని మేం ధైర్యంగా చెబుతున్నాం. యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు. సొంతంగా అమ్ముకునే రైతులు యాసంగిలో వరి వేసుకోవచ్చు. కేంద్రం తీసుకునే పరిస్థితి లేనందునే వరి వేయుద్దని చెబుతున్నాం. మొత్తం ధాన్యం సేకరణ, నిల్వశక్తి రాష్ట్రానికి లేదు. యాసంగికి రైతుబంధు యథాతథంగా ఇస్తాం’’ అని చెప్పారు.  

2. విదేశీ ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ తప్పనిసరి: ఆళ్ల నాని

విదేశాల నుంచి ఏపీకి వచ్చే వారికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్ష తప్పనిసరి అని.. ఈ పరీక్షలో పాజిటివ్‌ వస్తే క్వారంటైన్‌కు పంపిస్తామని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొవిడ్‌పై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వివరాలను మీడియాకు వెల్లడించారు. వచ్చే చ్చే ఏడాది జనవరి 15నాటికి రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తవ్వాలని సీఎం ఆదేశించినట్లు వెల్లడించారు.

3. విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదు: మంత్రి సబిత

విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు విద్యా సంస్థల్లో కొవిడ్‌ కేసులు వెలుగుచూడటంతో మంత్రి సబిత విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదన్నారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించి, జాగ్రత్తలు పాటించేలా చూడాలని పాఠశాలల యాజమాన్యాలను మంత్రి ఆదేశించారు.

4. బ్యాంకుల్లో నిధులు దాచొద్దు.. ప్రభుత్వ శాఖలకు ఉత్తర్వుల జారీ

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంబంధిత సంస్థలు తమ వద్ద ఉన్న ప్రజాధనాన్ని ఏ ఇతర బ్యాంకుల్లోనూ డిపాజిట్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పింది. కంపెనీ చట్టం కింద ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌లోనే ఆ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది. ప్రజాధనం రక్షణకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

5. రిలయన్స్‌ క్యాపిటల్‌ బోర్డు రద్దు.. ఆర్‌బీఐ కీలక నిర్ణయం!

ప్రముఖ వ్యాపారవేత్త అనిల్‌ అంబానీ ప్రమోటర్‌గా ఉన్న రిలయన్స్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌(ఆర్‌సీఎల్‌)పై దివాలా పరిష్కార స్మృతి (ఐబీసీ- ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌)ని ప్రయోగించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. అందులో భాగంగా నేడు కంపెనీ బోర్డును రద్దు చేసింది. ఆ స్థానంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నాగేశ్వర్‌ రావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. త్వరలో ఐబీసీ పరిష్కార ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. 

6. Omicron: బోట్స్​వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట

కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్​’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ గుబులు రేపుతోంది. ఈ వేరియంట్‌ మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని బోట్స్​వానా నుంచి భారత్​కు వచ్చిన ఓ మహిళను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు అధికారులు. ఈ నెల 18న ఆమె మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​కు వచ్చినట్లు జబల్​పుర్ వైద్యాధికారి డా.రత్నేష్​ కురారియా తెలిపారు.

7. కొత్త వేరియంట్‌తో ఒక్క మరణం కూడా లేదు..కానీ!: WHO

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం హెచ్చరించింది. అయితే ఈ వేరియంట్ ఏ స్థాయిలో వ్యాప్తి చెందుతుందో, తీవ్రత ఏ మేరకు ఉంటుందో అనే దానిపై మాత్రం అనిశ్చితి నెలకొని ఉందని వెల్లడించింది. ఈ కొత్త రకం వెలుగుచూసిన కొద్ది రోజుల్లోనే వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

8. Mehul Choksi: మళ్లీ కిడ్నాప్‌ చేస్తారేమో..!

మరోసారి తాను కిడ్నాప్‌నకు గురవుతానేమోనని పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు మెహుల్‌ చోక్సీ ఆందోళన చెందుతున్నట్లు ఓ ఆంగ్ల వార్త సంస్థ పేర్కొంది. ఈ నెల మొదట్లో చోక్సీ బాంబే హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తాను ప్రయాణాలు చేయలేనని.. పరారీలో ఉన్న నేరగాడి కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అమలు చేసే ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని కోరిన విషయం తెలిసిందే.

9. డెల్టాతో పోలిస్తే ఆరు రెట్లు వేగంగా ఒమిక్రాన్‌!

ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. డెల్టాతో పోలిస్తే ఆరురెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెల్టాతో పోల్చితే కొత్త వేరియంట్‌ ఆర్‌వాల్యూ ఎక్కువంటున్న నిపుణులు.. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ, కాక్ టెయిల్ చికిత్సలకు సైతం లొంగడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ ఆరు రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతోందని పేర్కొన్నారు.

10. IND vs NZ: తొలి టెస్టు డ్రా

కాన్పూర్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆఖరి సెషన్‌లో గొప్పగా పుంజుకున్న భారత బౌలర్లు.. ఐదు వికెట్లు పడగొట్టారు. మరో వికెట్ తీసి ఉంటే భారత్‌ ఘన విజయం సాధించేదే! అయితే, కివీస్‌ టెయిలెండర్లు అజాజ్‌ పటేల్ (2: 23 బంతుల్లో) రచిన్‌ రవీంద్ర (18: 91 బంతుల్లో 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడుతూ టీమ్‌ఇండియా విజయాన్ని అడ్డుకున్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

ఇవీ చదవండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని