Top 10 News @ 1PM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తల కోసం క్లిక్ చేయండి

Published : 19 Apr 2021 12:54 IST

1. పబ్‌లు, మద్యం దుకాణాలే ముఖ్యమా?

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.  జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు అడిగింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని పేర్కొన్న కోర్టు.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం

భారత్‌లో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో హాంకాంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి తమ దేశానికి విమాన రాకపోకల్ని తాత్కాలికంగా నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు హాంకాంగ్‌ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్‌తో పాటు పాకిస్థాన్‌, ఫిలిప్పైన్స్‌ నుంచి విమాన రాకపోకల్ని కూడా నిషేధించింది. ‘భారత్‌, పాకిస్థాన్‌, ఫిలిప్పైన్స్‌ దేశాల నుంచి విమాన రాకపోకల్ని నిషేధించేందుకు నిర్ణయించాం. ఏప్రిల్‌ 20 నుంచి 14 రోజుల పాటు ఆయా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్‌ విమానాలకు అనుమతి రద్దు చేస్తున్నాం’ అని హాంకాంగ్‌ ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. దిల్లీలో ఆరు రోజల లాక్‌డౌన్‌
దేశరాజధానిలో కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ నేటి రాత్రి నుంచి మొదలై వచ్చే సోమవారం ఉయదం వరకూ అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడి కోసం చేపడుతున్న చర్యలను వివరించారు. అంతకుముందు లాక్‌డౌన్‌పై కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌తో సమావేశమై చర్చించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. జగనన్న విద్యాదీవెన నిధుల విడుదల 

ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం మొదటి విడతను సీఎం జగన్‌ ఈ ఉదయం ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జగన్‌ ఆన్‌లైన్‌ ద్వారా రూ.671.45 కోట్ల నిధులను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,88,439 మంది విద్యార్థులు ఈ దఫా లబ్ధి పొందుతారు. విద్యాదీవెనలో భాగంగా విద్యార్థులకు తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..‘ జగనన్న విద్యాదీవెన గొప్ప కార్యక్రమం. చదువుతోనే జీవితాల రూపు రేఖలు మారతాయి.. పేదరికం నుంచి బయటపడతాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.671 కోట్లు జమ చేస్తున్నాం’ అన్నారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. హైదరాబాద్‌కు సత్యేంద్ర మిశ్రా

బుందేల్‌ఖండ్‌లో కొవిడ్‌తో  బాధపడుతున్న ప్రముఖ వైద్యుడు సత్యేంద్ర మిశ్రాను హైదరాబాద్‌కి తీసుకువచ్చారు. భోపాల్ నుంచి ఎయిర్ అంబులెన్స్ బేగంపేట చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌ నుంచి అంబులెన్స్‌లో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి ఆయనని తరలింలించారు. కొవిడ్తో సత్యేంద్ర మిశ్రా ఊపిరితిత్తులు 80 శాతం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. బుందేల్‌ఖండ్‌ మెడికల్ కాలేజీలో వైద్యుడిగా ఏడాది పాటు కోవిడ్ రోగులకు సత్యేంద్ర మిశ్రా చికిత్స అందించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ రెండో దశ వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. 3 లక్షలకు చేరువగా రోజువారీ కేసులు నమోదవడం వైరస్‌ తీవ్రతకు అద్దంపడుతోంది. గడిచిన 24గంటల్లో 13.56 లక్షల పరీక్షలు చేయగా.. 2,73,810 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో దేశంలో వరుసగా ఐదో రోజూ రెండు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇక మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. కొత్తగా 1,44,178మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,29,53,821కు చేరి.. రికవరీ రేటు 86.62శాతానికి తగ్గింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. గెలుపు క్యాచ్‌ పట్టే కీపర్‌ ఎవరు?

పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ ఈరోజు మ్యాచ్‌లో ఢీకొట్టనున్నాయి. రెండు జట్లూ రెండేసి మ్యాచులు ఆడి ఒక్కో గెలుపు, ఒక్కో ఓటమితో సమాన పాయింట్లతో ఉన్నాయి. ఇక ఈరోజు మ్యాచ్‌లో ఎవరి సత్తా ఎలా ఉండనుందో! ఇరు జట్లలోనూ ప్రధానంగా మిడిలార్డర్‌ నిలకడ లేమి కనిపిస్తోంది. ఈ సమస్యను ఏ జట్టు అధిగమించి దూసుకుపోతుందో చూడాలి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. తెలంగాణలో కొత్తగా 4,009 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 83,089 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,009 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో 14 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1,838కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,878 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,14,441కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9.ఆసుపత్రుల ముందు ఆంబులెన్సుల క్యూలు

గుజరాత్‌లో కరోనా విలయతాండవం కొనసాగిస్తున్న వేళ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు లేక రోగులు ఆంబులెన్సుల్లోనే వేచిచూస్తున్నారు. ఫలితంగా ఆసుపత్రుల ముందు కిలోమీటర్ల మేర ఆంబులెన్సులు క్యూలు కడుతున్నాయి. రాజ్‌కోట్‌లోని సివిల్‌ ఆసుపత్రి ముందు పదుల సంఖ్యలో బారులు తీరాయి. ఈ దృశ్యం కరోనా తీవ్రతకు, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. భౌతిక దూరం పాటించకుంటే విధ్వంసమే..

కరోనా రెండో దశ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. కొద్ది రోజులుగా రెండు లక్షలకు పైనే కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం సామాజిక దూరం పాటించకపోవడమేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారి నుంచి భౌతిక దూరం ఎలా మనల్ని రక్షిస్తుందో చూపిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండానికి చెందిన ఐఏఎస్‌ అధికారి నరహరి చేసిన ట్వీట్‌ సందేశాత్మకంగా ఉంది. మధ్యప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నరహరి భౌతిక దూరం పాటించకుంటే ఎంతటి విధ్వంసం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు వీడియోలో చూపించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని