Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Apr 2024 13:07 IST

1. పొన్నవోలుకు హడావుడిగా మేలు చేశారంటే మీకోసం పనిచేసినట్లేగా?: వైఎస్‌ షర్మిల

వైకాపా (YSRCP) పాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని.. ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్‌(YS Jagan)ను ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. మద్యనిషేధం చేయకపోగా.. ప్రభుత్వమే విక్రయిస్తోందన్నారు. మెగా డీఎస్సీకి బదులు దగా డీఎస్సీ ఇచ్చారని ఆక్షేపించారు. ఏటా సంక్రాంతికి ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఏమైందని నిలదీశారు. పూర్తి కథనం

2. గులకరాయి ఘటనలో జగన్‌కు భాస్కర్‌ అవార్డు ఇవ్వాలి: నారా లోకేశ్‌ ఎద్దేవా

గులకరాయి ఘటనలో సీఎం జగన్‌కు ఆస్కార్‌కు బదులు భాస్కర్‌ అవార్డు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.పూర్తి కథనం

3. అర్ధరాత్రి వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హల్‌చల్‌.. తెదేపా సానుభూతిపరులపై దాడి

రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో శనివారం అర్ధరాత్రి వైకాపా నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్‌రెడ్డితో పాటు హల్‌చల్ చేశారు. తెదేపా సానుభూతిపరులైన ఎస్సీలు, వాల్మీకుల ఇళ్లపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే గ్రామంలోనే ఉంటూ తెదేపాకు ఎలా మద్దతు తెలుపుతారంటూ గ్రామానికి చెందిన వనూరప్పా, లింగమయ్యలపై రాజశేఖర్‌రెడ్డి తన అనుచరులతో కలిసి దాడులు చేశారు.పూర్తి కథనం

4. మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు.. బాలీవుడ్‌ నటుడు సాహిల్‌ ఖాన్‌ అరెస్ట్‌

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణం కేసులో బాలీవుడ్‌ నటుడు, ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ సాహిల్‌ ఖాన్‌ (Sahil Khan)ను ముంబయి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. సైబర్‌ విభాగానికి చెందిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)’ ఆయన్ను ఛత్తీస్‌గఢ్‌లో కస్టడీలోకి తీసుకుంది. అరెస్టు నుంచి రక్షణ కోరుతూ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.పూర్తి కథనం

5. నా ముఖం కాదు.. మార్కులు చూడండి: ట్రోలర్లకు యూపీ టాపర్‌ దీటైన జవాబు

అందంగా ఉండకపోవడం ఏమైనా నేరమా..? సోషల్‌ మీడియా ట్రోలర్లకు ఈ మాత్రం ఇంగితజ్ఞానం కూడా లేకుండా పోయింది. ఉత్తరప్రదేశ్‌ పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన ఓ సరస్వతి పుత్రికను లక్ష్యంగా చేసుకొని వేధించడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె తప్పు ఏంటయ్యా అంటే.. ముఖంపై అవాంఛిత రోమాలు ఉండటం..! ఆ చిన్నారి మాత్రం చాలా హుందాగా స్పందించింది. పూర్తి కథనం

6. భారత్‌ను వదిలి వెళ్లిన దేవెగౌడ మనవడు..!

అసభ్యకర వీడియోల కేసు దుమారం రేగడంతో జనతాదళ్‌ (సెక్యులర్‌) అగ్రనేత దేవెగౌడ (Deve Gowda) మనవడు, ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) భారత్‌ వీడారు. ఆయన ఆదివారం ఉదయం బెంగళూరు నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌కు బయల్దేరి వెళ్లారు. మరో వైపు కర్ణాటక ప్రభుత్వం ఈ వీడియోలపై దర్యాప్తు కోసం స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన వేళ ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం. పూర్తి కథనం

7. దిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి అర్విందర్‌ సింగ్‌ రాజీనామా

కాంగ్రెస్‌ దిల్లీ శాఖ (DPCC) అధ్యక్షుడు అర్విందర్‌ సింగ్ లవ్లీ (Arvinder Singh Lovely) తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ఆదివారం ఉదయం వెల్లడించాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తుకు దిల్లీ యూనిట్‌ అంగీకరించలేదని రాజీనామా లేఖలో అర్విందర్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు కొనసాగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం పార్టీకి (Congress) తలనొప్పిగా మారింది.పూర్తి కథనం

8. ఆర్చరీ వరల్డ్‌ కప్‌లో భారత్ అద్భుతం.. ఒలింపిక్‌ ఛాంపియన్‌ను ఓడించి స్వర్ణం కైవసం

ఆర్చరీ వరల్డ్ కప్‌ 2024లో భారత్‌ మళ్లీ అద్భుతం చేసింది. ఇప్పటికే కాంపౌండ్‌ విభాగంలో మూడు, వ్యక్తిగత విభాగంలో ఒక స్వర్ణాన్ని గెలిచిన టీమ్‌ఇండియా మరో బంగారు పతకాన్ని ఖాతాలో వేసుకుంది. రికర్వ్‌ విభాగంలో భారత్ 5-1 తేడాతో (57-57, 57-55, 55-53) దక్షిణ కొరియాను ఓడించింది.పూర్తి కథనం

9. MH370 మిస్సింగ్‌లో ఏలియెన్స్‌ ఆధారాలు?.. ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారంటే..

గ్రహాంతర జీవుల (Aliens) విషయం ఇప్పటికీ ఓ పెద్ద మిస్టరీనే. గుర్తు తెలియని గుండ్రటి వస్తువులేవో ఆకాశంలో ఎగురుతున్నట్లుగా చెబుతూ కొన్ని వీడియోలు అప్పుడప్పుడు దర్శనమిస్తుంటాయి. అలా వచ్చిన ప్రతిసారీ దీనిపై చర్చ జరుగుతుంటుంది. 2014లో హఠాత్తుగా కనిపించకుండా పోయిన ఎంహెచ్‌370 విమానానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్‌ మీడియాలో వైరలైంది.పూర్తి కథనం

10. పదేళ్ల పాలనలో భాజపా ఎన్ని హామీలు అమలు చేసింది?: పొన్నం ప్రభాకర్‌

నాలుగు నెలల్లో 6 గ్యారంటీల్లో తొలుత చేయాల్సినవి అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడలో భారాసకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు సహా నేతలు మంత్రి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని