Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 28 Sep 2022 17:09 IST

1. సింగరేణి ఉద్యోగులకు సీఏం కేసీఆర్‌ దసరా కానుక

సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా కానుక ప్రకటించారు. 2021 -22 సంవత్సరానికి సింగరేణి కాలరీస్ సంస్థ గడిచిన లాభాల్లో 30 శాతం వాటాను ఉద్యోగులకు అందించాలని నిర్ణయించారు. సీఎం ఆదేశాల మేరకు కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని దసరాలోపు చెల్లించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను ఆదేశించారు. ఈ మేరకు సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగరావు ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. రాయలసీమ రైతులకు సీఎం జగన్‌ ఆఫర్‌.. ఎకరాకు రూ.30వేలు..!

రాయలసీమ రైతులకు ఏపీ సీఎం జగన్‌ ఓ ఆఫర్‌ ప్రకటించారు. రైతులు ముందుకొస్తే ఏడాదికి ఎకరానికి రూ.30వేలు లీజు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని చెప్పారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల వద్ద రామ్‌కో సిమెంట్స్‌ పరిశ్రమను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జగన్‌ మాట్లాడుతూ లీజు అంశాన్ని తీసుకొచ్చారు. ప్రభుత్వమే రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని సౌర, పవన విద్యుత్‌  తయారీ సంస్థలకు ఇస్తుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణపై తీవ్రమైన చర్యలకు దిగొద్దు: హైకోర్టు

తెలంగాణ, ఏపీ విద్యుత్‌ బకాయిల వివాదంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ విద్యుత్‌ సంస్థలకు రూ.7వేల కోట్లు తెలంగాణ చెల్లించాలని కేంద్రం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన ధర్మాసనం.. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ బకాయిల వివాదంపై తీవ్రమైన చర్యలకు దిగవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు.. రమణ దీక్షితులు వివాదాస్పద ట్వీట్‌

తితిదేలో బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఉన్నాయంటూ శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వివాదాస్పద ట్వీట్‌ చేశారు. తితిదేలోని బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఆలయ విధానాలతో పాటు, అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని కోరారు. వంశపారంపర్య అర్చక వ్యవస్థపై కమిటీ సిఫారసులు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కమిటీ సిఫార్సులపై సీఎం జగన్‌ ప్రకటన చేయకపోవడం నిరాశపర్చిందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. టార్గెట్‌ 2024.. భాజపా కొత్త ఇన్‌ఛార్జిలతో నడ్డా కీలక భేటీ!

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఆ పార్టీ రాష్ట్రాల ఇన్‌ఛార్జిలతో భేటీ అయ్యారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంతో పాటు 2024 సాధారణ ఎన్నికలకు సమాయత్తం కావడమే లక్ష్యంగా పలు అంశాలపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. ఇటీవల రాష్ట్రాలకు భాజపా కొత్త ఇన్‌ఛార్జిలను నియమించిన తర్వాత వారందరితో నడ్డా భేటీ ఇదే తొలిసారి కావడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. దిల్లీకి గహ్లోత్‌.. సోనియాతో భేటీ కానున్న సీఎం..!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వేళ.. రాజస్థాన్‌ రాజకీయాల్లో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. అధ్యక్ష ఎన్నికలో గెలుపొందినా, ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని అశోక్ గహ్లోత్ ఆశించడం.. ఎలాగైనా ఆ పీఠంపై కూర్చోవాలని సచిన పైలట్‌ ప్రయత్నించడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ క్రమంలో గహ్లోత్ దిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రోజు ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. సూర్య @ ప్రపంచ నెం.2

టీ20ల్లో నిలకడగా రాణిస్తూ ర్యాంకింగ్స్‌లో పాక్‌ ఆటగాడు బాబర్‌ ఆజమ్‌ను సూర్య దాటేశాడు. దీంతో ఐసీసీ టీ20 పురుషుల ప్రపంచ ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో మొత్తం 801 పాయింట్లతో భారత స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో స్థానం దక్కించుకొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌లో 36 బంతుల్లో 69 పరుగులు చేసి ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. పాక్‌ ఓపెనర్‌ మహమ్మద్‌ రిజ్వాన్‌ 861 పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. డీఏ 4 శాతం పెంపు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం (డీఏ)ను 4 శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో డీఏ పెంపునకు ఆమోదం లభించింది. జులై నుంచి పెంచిన డీఏ అమల్లోకి వస్తుందని కేబినెట్‌ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఉచిత రేషన్‌.. మరో మూడు నెలలు పొడిగింపు!

కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పేద ప్రజల కోసం రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఉచిత రేషన్‌ పథకం మరికొన్నాళ్లు కొనసాగనుంది. ప్రస్తుత గడువు సెప్టెంబరు 30వ తేదీతో ముగియనుండటంతో మరో మూడు నెలల పాటు ఉచిత రేషన్‌ అందించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. టాటా టియాగో ఈవీ వచ్చేసింది.. ధర, స్పెసిఫికేషన్లపై లుక్కేయండి..

విద్యుత్‌ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్‌).. భారత మార్కెట్లో మరో విద్యుత్‌ కారును లాంచ్‌ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో 19.2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.8.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.  24 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ.9.09 లక్షలు నుంచి మొదలవుతుంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని