Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 09 Apr 2023 20:58 IST

1. భారాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: మంత్రి కేటీఆర్‌

తెలంగాణలో విస్తృతంగా భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో భారాస ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించనుంది. ఈ మేరకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ప్రకటన విడుదల చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తెలంగాణ గడ్డపై భాజపాను అడుగు పెట్టనివ్వం: సీపీఐ, సీపీఎం

భాజపా నుంచి దేశాన్ని రక్షించుకోవడానికి ఉమ్మడి పోరాటాలు చేస్తామని సీపీఎం, సీపీఐ ప్రకటించాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన సంయుక్త సమ్మేళనంలో ఇరు పార్టీల ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో భారాసతో కలిసి సాగుతామని, తెలంగాణ గడ్డపై భాజపాను అడుగు పెట్టనివ్వమని కమ్యూనిస్టులు నినదించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. యాసంగి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి: సీఎం కేసీఆర్‌ ఆదేశం

యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాలశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌కు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెర్స్‌ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సీఎస్‌ను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘నా ఫోన్‌ పోయింది’.. పోలీసులకు బండి సంజయ్‌ ఫిర్యాదు

తన ఫోన్‌ పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన వ్యవహారంలో ఈనెల 5న సంజయ్‌ అరెస్టు సమయంలో పోలీసులకు, భాజపా కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో తన ఫోన్‌ పడిపోయినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కేంద్రంపై ‘కోటి’ లేఖల యుద్ధానికి తృణమూల్‌ సై

నిధుల చెల్లింపుల్లో జాప్యం, బకాయిపడిన నిధుల అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాపై ఒత్తిడి తెచ్చేందుకు పశ్చిమ్‌బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ‘కోటి లేఖలు’ పేరిట కొత్త అస్త్రంతో సిద్ధమవుతోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం డిమాండ్‌ చేస్తూ బెంగాల్‌ ప్రజలు ప్రధాని మోదీకి కోటి లేఖలు రాస్తారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆఖర్లో అద్భుతం చేసిన రింకూ సింగ్‌.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాదే గెలుపు

ఐపీఎల్‌-16లో కోల్‌కతా అదరగొట్టింది.  గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్‌ (48; 21 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లు) చివర్లో విరుచుకుపడి గుజరాత్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బంగారం దిగుమతుల్లో 30% తగ్గుదల.. కారణాలివే..!

గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఏప్రిల్‌- ఫిబ్రవరి మధ్య బంగారం దిగుమతులు (Gold Imports) 30 శాతం తగ్గి 31.8 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అధిక కస్టమ్స్‌ సుంకం, ప్రపంచవ్యాప్తంగా అస్థిర ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని కేంద్ర వాణిజ్య శాఖ తన నివేదికలో పేర్కొంది. 2021-22 ఇదే సమయంలో పసిడి దిగుమతులు (Gold Imports) 45.2 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమృత్‌పాల్‌ వీడియో ఎఫెక్ట్‌...పంజాబ్‌లో భద్రత కట్టుదిట్టం

బైసాఖి వేడుకల నేపథ్యంలో పంజాబ్‌ వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సిక్కుల ఆకాంక్షలను ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఈ వేడుకలను వేదికగా చేసుకోవాలని ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు అమృత్‌పాల్‌ సింగ్ తన అనుచరులకు పిలుపునిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిని అధికారులు ధ్రువీకరించకపోయినప్పటికీ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భద్రతను భారీగా పెంచుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సీఆర్‌పీఎఫ్‌ పరీక్షను ప్రాంతీయ భాషల్లో నిర్వహించండి..!

సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) ఉద్యోగ నియామక పరీక్ష కేవలం ఇంగ్లిష్‌, హిందీలో నిర్వహించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం లేకపోవడం వివక్ష, ఏకపక్షమని మండిపడ్డారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మొసలి కళ్లలో పొడిచి.. ప్రాణాలతో బయటపడి!

ఆస్ట్రేలియాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. మొసలి నోట చిక్కిన ఓ వ్యక్తి.. చాకచక్యంతో దాని బారినుంచి తప్పించుకోవడం గమనార్హం. స్థానిక అధికారుల వివరాల ప్రకారం.. 44 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఇక్కడి క్వీన్స్‌లాండ్‌లోని కూక్‌టౌన్‌ వద్ద సముద్రంలో చేపలు పట్టేందుకు దిగాడు. ఈ క్రమంలోనే దాదాపు 4.5 మీటర్ల పొడవున్న ఓ మొసలి తనను సమీపిస్తున్నట్లు గుర్తించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని