Trinamool Congress: కేంద్రంపై ‘కోటి’ లేఖల యుద్ధానికి తృణమూల్‌ సై

కేంద్రంలో అధికార భాజపా (BJP)ని ఇరుకున పెట్టేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (Trinamool Congress) కొత్త అస్త్రంతో సిద్ధమవుతోంది. బకాయిపడిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కోటి లేఖలు రాసి కేంద్రానికి పంపేందుకు సమాయాత్తమవుతోంది.

Published : 09 Apr 2023 18:24 IST

కోల్‌కతా: నిధుల చెల్లింపుల్లో జాప్యం, బకాయిపడిన నిధుల అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాపై ఒత్తిడి తెచ్చేందుకు పశ్చిమ్‌బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ సమాయత్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ‘కోటి లేఖలు’ పేరిట కొత్త అస్త్రంతో సిద్ధమవుతోంది. ‘‘రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం డిమాండ్‌ చేస్తూ బెంగాల్‌ ప్రజలు ప్రధాని మోదీకి కోటి లేఖలు రాస్తారు. ఈ లేఖలన్నింటినీ నేను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తాను. ఆ లేఖలతో దిల్లీకి బయల్దేరిన నన్ను కేంద్రం ఎలా ఆపుతుందో చూస్తాను’’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి  అభిషేక్‌ బెనర్జీ అన్నారు.

అంతేకాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం కింద బెంగాల్‌కు రావాల్సిన నిధుల విడుదల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు బెనర్జీ ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికలతోపాటు 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా మంచి ప్రదర్శన చేసిన అలీపుర్దువార్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా ఇటీవల రెండు రోజులపాటు కోల్‌కతాలో నిరసన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు ఖర్చుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించడం లేదని, నిధులను పక్కదోవ పట్టిస్తుందనే ఉద్దేశంతోనే కేంద్రం తాత్కాలికంగా నిలుపుదల చేసిందని భాజపా వాదిస్తోంది.

బెంగాల్ నూతన సంవత్సరం పోయిలా బొయ్‌సాక్‌ రోజున ‘కోటి లేఖల’ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని బెనర్జీ వెల్లడించారు. తొలినెలలో సంతకాలు సేకరిస్తామని, ఆ తర్వాతి నెలలో 50 వేల మంది, కోటి లేఖలతో కలిసి రాజధాని దిల్లీకి వెళ్తామని చెప్పారు. వాటన్నింటినీ ప్రధానమంత్రి కార్యాలయం, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి కార్యాలయంలో సమర్పిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని