GT vs KKR: ఆఖర్లో అద్భుతం చేసిన రింకూ సింగ్‌.. ఉత్కంఠ పోరులో కోల్‌కతాదే గెలుపు

ఐపీఎల్‌-16లో కోల్‌కతా అదరగొట్టింది.  గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated : 09 Apr 2023 20:02 IST

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌-16లో కోల్‌కతా అదరగొట్టింది.  గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కోల్‌కతా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.  తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్‌ (48; 21 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లు) చివర్లో విరుచుకుపడి గుజరాత్ గెలుపు ఆశలపై నీళ్లు చల్లాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ (83; 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) భారీ ఇన్నింగ్స్‌ ఆడాడు. నితీశ్ రాణా (45; 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. 

ఆఖరి ఓవర్‌లో ఐదు సిక్స్‌లు 

అల్జారీ జోసెఫ్ వేసిన 16 ఓవర్‌లో  వెంకటేశ్ అయ్యర్‌ ఔటవ్వడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. ఈ ఓవర్‌లో నాలుగో బంతికి వెంకటేశ్ అయ్యర్‌ గిల్‌కు చిక్కాడు. రషీద్ ఖాన్‌ వేసిన 17 ఓవర్లో తొలి బంతికి రస్సెల్ (1) వికెట్ కీపర్‌ భరత్‌కు చిక్కాడు. రెండో బంతికి సునీల్ నరైన్‌ (0) జయంత్‌ యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మూడో బంతికి శార్దూల్ ఠాకూర్‌ (0) వికెట్ల ముందు దొరికిపోయాడు. కోల్‌కతా విజయానికి చివరి ఓవర్‌లో 29 పరుగులు అవసరం కాగా.. రింకూ సింగ్ వరుసగా ఐదు సిక్స్‌లు బాదడంతో కోల్‌కతా విజయం సాధించింది.  

తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ టైటాన్స్..  20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది. చివర్లో విజయ్‌ శంకర్‌ (63*; 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచికొట్టాడు. శంకర్‌ 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాదాడు. చివరి రెండు ఓవర్లలో 45 పరుగులు రాగా.. ఇందులో శంకర్ చేసినవి 41. సాయి సుదర్శన్‌ (53; 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్ (39; 31 బంతుల్లో 5 ఫోర్లు) కూడా రాణించారు.  వృద్ధీమాన్‌ సాహా (17), అభినవ్‌ మనోహర్‌ (14) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ (3/33) ఆకట్టుకోగా.. సుయాశ్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని