Gold Imports: బంగారం దిగుమతుల్లో 30% తగ్గుదల.. కారణాలివే..!

Gold Imports: అధిక కస్టమ్స్‌ సుంకం, ప్రపంచవ్యాప్తంగా అస్థిర ఆర్థిక పరిస్థితుల కారణంగా ఏప్రిల్‌- ఫిబ్రవరి 2023 మధ్య బంగారం దిగుమతుల గణనీయంగా తగ్గాయి.

Published : 09 Apr 2023 17:46 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఏప్రిల్‌- ఫిబ్రవరి మధ్య బంగారం దిగుమతులు (Gold Imports) 30 శాతం తగ్గి 31.8 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అధిక కస్టమ్స్‌ సుంకం, ప్రపంచవ్యాప్తంగా అస్థిర ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని కేంద్ర వాణిజ్య శాఖ తన నివేదికలో పేర్కొంది. 2021-22 ఇదే సమయంలో పసిడి దిగుమతులు (Gold Imports) 45.2 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2022 ఏప్రిల్‌ నుంచి దిగమతులు తగ్గుతూ వస్తున్నాయి.

2022-23లో ఏప్రిల్‌- ఫిబ్రవరి మధ్య వెండి దిగుమతులు 66 శాతం పెరిగి 5.3 బిలియన్‌ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు (Gold Imports) గణనీయంగా తగ్గినప్పటికీ.. వాణిజ్యలోటు (trade deficit) మాత్రం ఆ స్థాయిలో తగ్గకపోవడం గమనార్హం. 2022-23 ఏప్రిల్‌- ఫిబ్రవరి మధ్య సరకుల వాణిజ్య లోటు 247.52 బిలియన్‌ డాలర్లుగా అంచనా వేసింది. అంత క్రితం ఏడాది ఇదే సమయంలో ఇది 172.53 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే దేశం భారత్‌. ముఖ్యంగా ఆభరణాల పరిశ్రమలో ఉండే డిమాండ్‌ వల్లే భారీ ఎత్తున పసిడిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఏడాదికి సగటున భారత్‌ 800- 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. మరోవైపు ఏప్రిల్‌- ఫిబ్రవరి 2023 మధ్య రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 0.3 శాతం పడిపోయి 35.2 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ప్రస్తుత ఖాతా లోటును తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని