BRS: భారాస ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: మంత్రి కేటీఆర్‌

భారాస ఆవిర్భావ దినోత్సవం ఈనెల 27ను పురస్కరించుకొని విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈమేరకు భారాస కార్యనిర్వహాక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటన చేశారు.

Updated : 09 Apr 2023 15:57 IST

హైదరాబాద్‌: తెలంగాణలో విస్తృతంగా భారత రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు చేపట్టేందుకు ఆ పార్టీ సమాయత్తమవుతోంది. రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ఈ నెల 27న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో భారాస ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించనుంది. ఈ మేరకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ప్రకటన విడుదల చేశారు. 27వ తేదీన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన జరగనున్న భారాస సర్వసభ్య సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టి, చర్చించనుంది. ఏప్రిల్ 25వ తేదీన నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సమావేశాలు జరగనున్నాయి. అక్టోబరు 10వ తేదీన వరంగల్‌లో భారాస భారీ మహాసభ నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించుకుంటున్న భారాస ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలకు పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన వస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 25న నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించుకోవాలని... ఈ సమావేశాలు పార్టీ నియమించిన ఇంఛార్జ్‌లు, స్థానిక ఎమ్మెల్యేల అధ్యక్షతన కొనసాగుతుందన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశాల నిర్వహణను సమన్వయం చేస్తారని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో అన్నీ గ్రామాలు, వార్డుల్లో ఆ రోజు ఉదయమే పండగ వాతావరణంలో పార్టీ జెండాలు ఎగరవేయాలని, గ్రామాలు, వార్డుల్లో జెండా పండుగ కార్యక్రమం ముగించుకుని ఉదయం 10 గంటల కల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ప్రతినిధులు సభ సమావేశ స్థలికి చేరుకోవాలని పార్టీ శ్రేణులను కోరారు. సమావేశాలకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు అవసరమైన భోజనాలు, ఇతర వసతులు ఏర్పాటు చేయాలని, వేసవికాలం నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పార్టీ ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్‌లకు కేటీఆర్‌ సూచించారు.

మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లు..

మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఇంఛార్జ్‌గా మర్రి రాజశేఖర్ రెడ్డి, గోషామహల్ నియోజకవర్గం ఇంఛార్జ్‌గా నంద కిషోర్ వ్యాస్ బిలాల్, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఎంపీ మాలోతు కవితలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరు ప్రస్తుతం కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలతోపాటు భారాస ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ, నియోజకవర్గాలకు బాధ్యులుగా కొనసాగుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు