Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 17 Apr 2023 20:55 IST

1. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన వారికి ప్రొబేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. శాఖాపరమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో పాటు, రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్‌ వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నగర వాసులను పలకరించిన వరుణుడు.. పలుచోట్ల వడగళ్ల వాన

మండుటెండలతో సతమతమవుతున్న నగర వాసులను వరుణుడు పలకరించాడు. సోమవారం నగరంలోని పలు ప్రాంతాల్లో  వడగళ్ల వాన కురిసింది. నాంపల్లి, హైకోర్టు, గోషామహల్, బేగంబజార్‌, బహదూర్‌పురా తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం పడగా.. చంచల్‌గూడ, సైదాబాద్‌, చంపాపేట, కోఠి, అబిడ్స్‌, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, లిబర్టీ, బషీర్‌బాగ్‌, హైదర్‌గూడ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ ఎంపీ వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ విచారణను ముమ్మరం చేసిన నేపథ్యంలో..  కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. అదుపులోకి తీసుకుంటారన్న అవినాష్ వ్యాఖ్యలపై న్యాయమూర్తి సీబీఐ స్పందన కోరారు. అది నిజమేనని, ఆయన్ను అదుపులోకి తీసుకుంటామని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎవరీ గుడ్డూ..?అతీక్‌ సోదరుడి చివరి మాట అతడి పేరే..!

హత్యకు ఒక్క క్షణం ముందు గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ సోదరుడు అష్రాఫ్‌ తమ ప్రధాన బాంబ్‌స్పెషలిస్టు గురించి ఏదో ప్రస్తావిస్తూ.. ‘‘అసలు విషయం ఏమిటంటే.. గుడ్డూముస్లిం’’ అని ఏదో చెప్పబోయాడు. అదే సమయంలో అత్యంత సమీపం నుంచి హంతకులు అతీక్‌ను కాల్చేశారు. అష్రాఫ్‌ ఆ షాక్‌ నుంచి తేరుకొనేలోపే.. అతడిపై కూడా తూటాల వర్షం కురిసింది. దీంతో అతీక్‌ సోదరులిద్దరూ అచేతనంగా నేలపై పడిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్య రికార్డులు

ఐపీఎల్‌-16 (IPL)లో రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) సారథి సంజూశాంసన్‌ (Sanju Samson), గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ (GT) హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అరుదైన ఘనత సాధించారు. ఆర్‌ఆర్‌ జట్టు తరఫున 3000 పరుగుల మైలురాయికి చేరుకున్న తొలి బ్యాటర్‌గా సంజూ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 2000 పరుగులు సాధించి 50 వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్య నిలిచాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఏఐని తలచుకుంటే నిద్రలేని రాత్రులు..!’: గూగుల్‌ చీఫ్‌

కృత్రిమ మేధను (Artificial Intelligence) సరైన విధంగా వినియోగించకుంటే హానికరమైన పరిణామాలు తప్పవని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ (Sundar Pichai) హెచ్చరించారు. అటువంటి ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఏఐ సాంకేతికతపై నియంత్రణ ఉంచాలని స్పష్టం చేశారు. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పిచాయ్‌.. కృత్రిమ మేధ (AI) దుష్ర్పభావాలను తలచుకుంటే నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వందే భారత్‌ సగటు వేగం 83 Kmph.. ఆ రూట్లో అత్యధికం!

దేశంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలున్నా.. ట్రాకుల సామర్థ్యం దృష్ట్యా 130 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతున్నారు. అయితే, వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గడిచిన రెండేళ్లలో 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్లు షురూ!

సుప్రసిద్ధమైన అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేందుకు భక్తుల రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర ఈసారి జులై 1న ప్రారంభమై ఆగస్టు 31వరకు కొనసాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు యాత్రికులు అమర్‌నాథ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు బ్యాంకు శాఖల్లోనూ నమోదు చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రాజ్యాంగాన్ని ఏమైనా మార్చుతున్నారా..? అమిత్‌ షా వ్యాఖ్యలపై మమత మండిపాటు

2025 తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడలో ఉండదని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘లెక్కల్లో వెనుకబాటు..! బ్రిటన్‌ ధోరణి మారాలి’

గణితం విషయంలో బ్రిటన్‌ తన వ్యతిరేక ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) పేర్కొన్నారు. లెక్కల్లో విద్యార్థుల వెనుకబాటును తగ్గించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ విషయంపై రిషి సునాక్‌ సోమవారం ప్రసంగించారు. లెక్కల్లో తాము వెనుకబడి ఉన్నామని జోకులు చేసుకోవడం ఆమోదయోగ్యం కాకూడదని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని