Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్రకు రిజిస్ట్రేషన్లు షురూ!

అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లే భక్తులకు రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఔత్సాహిక యాత్రికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

Updated : 17 Apr 2023 19:49 IST

శ్రీనగర్‌: సుప్రసిద్ధమైన అమర్‌నాథ్‌ యాత్ర(Amarnath Yatra)కు వెళ్లేందుకు భక్తుల రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో 3,880 మీటర్ల ఎత్తున ఉన్న అమర్‌నాథ్‌ పుణ్యక్షేత్ర వార్షిక యాత్ర ఈసారి జులై 1న ప్రారంభమై ఆగస్టు 31వరకు కొనసాగనుంది. మొత్తం 62 రోజుల పాటు సాగే ఈ యాత్రలో పాల్గొనేందుకు యాత్రికులు అమర్‌నాథ్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు బ్యాంకు శాఖల్లోనూ నమోదు చేసుకోవచ్చు. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు చెందిన 316 శాఖల్లో ఈ ప్రక్రియ మొదలైందని ఆ బ్యాంకు చీఫ్‌ మేనేజర్‌ రోహిత్‌ రైనా వెల్లడించారు.  గతేడాది వరకు యాత్రికులకు మాన్యువల్‌గా ఫాంలు ఇచ్చారని.. ఇప్పుడు సిస్టమ్‌ జెనరేటెడ్‌ ఫాంలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ యాత్రలో పాల్గొనాలనుకొనే ఔత్సాహిక యాత్రికులు తమ ఆరోగ్య ధ్రువీకరణ పత్రాలను పొందడం తప్పనిసరన్నారు.  

మరోవైపు, జమ్మూలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు శాఖను పువ్వులతో అందంగా ముస్తాబు చేశారు. ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్లు మొదలైన నేపథ్యంలో బ్యాంకుకు పెద్ద సంఖ్యలో యాత్రికులు తమ పేర్లు నమోదు చేసుకొనేందుకు తరలివచ్చారు. మామూలుగా అయితే ఉదయం 9గంటలకు బ్యాంకు తెరుచుకోవాల్సి ఉన్నప్పటికీ యాత్రికులు మాత్రం ఉదయం 8.30గంటలకు వచ్చి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ‘‘నేను తొలి రోజే ఆ దివ్య క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకుంటున్నా. అందుకే ఉదయాన్నే 8.30గంటలకే ఇక్కడికి వచ్చి క్యూలైన్లలో నిలబడ్డా’’ అని ఓ ఔత్సాహిక యాత్రికుడు తెలిపారు.  ఈ ఏడాది కూడా రెండు మార్గాల ద్వారా యాత్ర కొనసాగనుంది. ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలను లైవ్‌ టెలికాస్ట్‌ చేయనున్నారు. తమ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా 542 బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. 13 ఏళ్లలోపు పిల్లలను, 75 ఏళ్లు పైబడిన వృద్ధులను యాత్రకు అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని