IPL 2023: ఐపీఎల్‌లో సంజూ శాంసన్‌, హార్దిక్‌ పాండ్య రికార్డులు

ఐపీఎల్‌-16లో భాగంగా ఆదివారం రాజస్థాన్‌-గుజరాత్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ సారథి సంజూ శాంసన్‌, గుజరాత్ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య అద్భుతంగా రాణించి అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. 

Published : 17 Apr 2023 19:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్‌-16 (IPL)లో రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) సారథి సంజూశాంసన్‌ (Sanju Samson), గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ (GT) హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) అరుదైన ఘనత సాధించారు. ఆర్‌ఆర్‌ జట్టు తరఫున 3000 పరుగుల మైలురాయికి చేరుకున్న తొలి బ్యాటర్‌గా సంజూ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో 2000 పరుగులు సాధించి 50 వికెట్లు పడగొట్టిన రెండో భారత ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్య నిలిచాడు.

ఆదివారం జీటీతో జరిగిన మ్యాచ్‌లో శాంసన్‌ మూడు ఫోర్లు, ఆరు సిక్సులతో చెలరేగి 32 బంతుల్లో 60 పరుగులు సాధించాడు.  దీంతో ఆర్‌ఆర్‌ జట్టు తరఫున 115 మ్యాచులు ఆడిన శాంసన్‌ 3006 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 16 అర్ధశతకాలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అతడి ఉత్తమ స్కోర్‌ 119. అంతకుముందు శాంసన్‌ దిల్లీకి ప్రాతినిధ్యం వహించాడు. దిల్లీ తరఫున అతడు 3 శతకాలు, 19 అర్ధశతకాలు బాది 3,683 పరుగులు సాధించాడు. 

ఐపీఎల్‌-16లో భాగంగా ఆదివారం ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్య 28 పరుగులతో రాణించాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 100 మ్యాచులు ఆడిన పాండ్య 50 వికెట్లు పడగొట్టి 2000 పరుగులు సాధించాడు. ఐపీఎల్‌లో షేన్‌ వాట్సన్‌, ఆండ్రీ రసెల్, రవీంద్ర జడేజా, కీరన్‌ పొలార్డ్, జాక్వెస్‌ కలిస్‌ మాత్రమే ఈ ఘనత సాధించారు. తన అద్భుత ప్రదర్శనతో పాండ్య ఐపీఎల్‌ దిగ్గజ ఆల్‌రౌండర్ల జాబితాలో చేరాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని