Vande Bharat Express: వందే భారత్‌ సగటు వేగం 83 Kmph.. ఆ రూట్లో అత్యధికం!

Vande Bharat Express average speed: గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సగటు వేగం 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఆర్‌టీఐ కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది.

Published : 18 Apr 2023 02:07 IST

Vande Bharat Express | దిల్లీ: దేశంలో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు (Vande Bharat Express) ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలున్నా.. ట్రాకుల సామర్థ్యం దృష్ట్యా 130 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతున్నారు. అయితే, వందే భారత్‌ రైళ్ల సగటు వేగం (Vande Bharat Express average speed) గడిచిన రెండేళ్లలో 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్‌ గౌర్‌ ఈ దరఖాస్తు దాఖలు చేశారు.

2021-22లో వందే భారత్‌ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా.. 2022-23 సంవత్సరంలో 81.38 కిలోమీటర్ల సగటు వేగంతో నడిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైలు వాస్తవ సామర్థ్యం అధికంగా ఉన్నప్పటికీ.. దాని గరిష్ఠ వేగం ట్రాకుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం 14 వందే భారత్‌ రైళ్లు నడుస్తుండగా.. ముంబయి సీఎస్ఎంటీ- సాయినగర్‌ శిర్డీ వందేభారత్‌ రైలు సగటు వేగం కనిష్ఠంగా 64 కిలోమీటర్లు మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. 2019 ప్రారంభమైన న్యూదిల్లీ- వారణాశి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సగటు వేగం మాత్రం గరిష్ఠంగా గంటకు 95కిలోమీటర్ల సగటు వేగంతో ప్రయాణిస్తోందని రైల్వే అధికారులు తెలిపారు. రాణి కమలాపతి- హజ్రత్‌ నిజాముద్దీన్‌ వందే భారత్‌ రైలు సగటు వేగం సైతం 94 కిలోమీటర్లుగా ఉందని పేర్కొన్నారు. రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల కంటే వందే భారత్‌ రైళ్ల సగటు వేగం ఎక్కువగా ఉందని రైలు అధికారులు తెలిపారు. ఆయా సెక్షన్లలో నడుస్తున్న వేగవంతమైన రైళ్లలో వందే భారత్‌ రైళ్లే ముందు వరుసలో ఉన్నాయని వెల్లడించారు.

వందే భారత్‌ తొలి రైలు 2018 అక్టోబర్లో అందుబాటులోకి వచ్చింది. తొలి తరం వందే భారత్‌ రైలును ట్రైన్‌ 2018గా పేర్కొన్నారు. ప్రయోగాల సమయంలో ఈ రైలు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది. ప్రస్తుతానికి 130 కిలోమీటర్ల వేగాన్ని మాత్రమే అనుమతిస్తున్నారు. ఈ రైళ్ల వల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గించిందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఛైర్‌కార్‌కు మాత్రమే ఉండగా.. స్లీపర్‌ తరగతులను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. వందే భారత్ రైళ్లు గరిష్ఠ వేగాన్ని అందుకోవడానికి వీలుగా రైల్వే నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. తదుపరి తరం వందే భారత్‌ రైళ్లు గరిష్ఠంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు