Rishi Sunak: ‘లెక్కల్లో వెనుకబాటు..! బ్రిటన్‌ ధోరణి మారాలి’

బ్రిటన్‌ తన ‘గణిత వ్యతిరేక ధోరణి’ నుంచి బయటపడాలని దేశ ప్రధాని రిషి సునాక్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై సోమవారం ఆయన ప్రసంగించారు.

Published : 17 Apr 2023 19:18 IST

లండన్‌: గణితం (Maths) విషయంలో బ్రిటన్‌ (Britain) తన వ్యతిరేక ధోరణిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని రిషి సునాక్‌ (Rishi Sunak) పేర్కొన్నారు. లెక్కల్లో విద్యార్థుల వెనుకబాటును తగ్గించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ విషయంపై రిషి సునాక్‌ సోమవారం ప్రసంగించారు. లెక్కల్లో తాము వెనుకబడి ఉన్నామని జోకులు చేసుకోవడం ఆమోదయోగ్యం కాకూడదని అన్నారు. ‘ఏ’ లెవల్‌లో అత్యంత ఆదరణ పొందిన సబ్జెక్టుల్లో మ్యాథ్స్ ఒకటని, అయితే దీన్ని తగినంతగా నేర్చుకోని వారూ ఉన్నారని చెప్పారు. ఈ విషయంలో ‘ఆటిట్యూడ్‌’ సమస్య ఉన్నట్లు తెలిపారు.

గణితంపై మరింత దృష్టి సారించాలని తన కుమార్తెలకూ సూచించినట్లు రిషి గుర్తుచేసుకున్నారు. అయితే వారు ఆసక్తి చూపడం లేదని చెప్పారు. ‘మేం లెక్కలు చేయలేం.. ఈ సబ్జెక్టు మా కోసం కాదని కొందరు జోకులు వేస్తుంటారు. కానీ, చదవలేమ(Read)ని ఎవరూ అనరు. కాబట్టి, మనం ఈ గణిత వ్యతిరేక వైఖరిని మార్చుకోవాలి’ అని పేర్కొన్నారు. సృజనాత్మక రంగాల మొదలు ఆర్థిక రంగం వరకు గణితం ముఖ్యమైందన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులు మరింత గణితం నేర్చుకునేలా ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు.. గణిత శాస్త్రజ్ఞులు, విద్యావేత్తలు, వ్యాపార ప్రతినిధులతో సలహా బృందం ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఉపాధ్యాయులూ ఈ దిశగా ముందుకు రావాలని రిషి సునాక్‌ పిలుపునిచ్చారు. ప్రాథమిక పాఠశాలల్లో గణితాన్ని బోధించేలా టీచర్లలో విశ్వాసం పెంపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఇదే సాధ్యమైతే.. యువత మేలైన భవిష్యత్తు కోసం తోడ్పడిన వారమవుతామని తెలిపారు. అయితే, ఈ ప్రణాళికను అమలు చేసేందుకు బ్రిటన్‌కు ఎక్కువ మంది గణిత ఉపాధ్యాయులు అవసరమని కూడా ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని