Top Ten News @ 9AM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు 

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated : 23 Oct 2021 09:00 IST

1. ప్రపంచంపై మళ్లీ కొవిడ్‌ పంజా

కరోనా వైరస్‌ మళ్లీ పంజా విసురుతోంది. పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో శుక్రవారం కొత్తగా సుమారు 50 వేల కేసులు నమోదయ్యాయి. రష్యా, ఉక్రెయిన్‌, రుమేనియాల్లో కొవిడ్‌ తీవ్రత ఎక్కువవుతోంది. చైనాలోనూ మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం కొవిడ్‌ ఆంక్షలను కఠినతరం చేసింది. ప్రజలకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు అందకపోవడం, కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి తీవ్రంగా ఉండటమే ఇందుక్కారణమని భావిస్తున్నారు.

2. చరిత.. భవిత మాదే

ఏడెనిమిది దశాబ్దాలైనా చెక్కుచెదరని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని తీర్చిదిద్దుతామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు తెలిపారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజాభిమానంతో తెరాస అప్రతిహతంగా ముందుకు సాగుతోందని, సంస్థాగత నిర్మాణంతో మరింత దృఢంగా తయారు చేస్తామని తెలిపారు. కేసీఆర్‌ మరో 20 ఏళ్లు సీఎంగా ఉంటారన్నారు. తెలంగాణ సాధనే పార్టీకి అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. ఎన్నిక ఏదైనా ఘనవిజయం సాధిస్తున్నామన్నారు. ప్లీనరీ, విజయగర్జన తర్వాత మరింత ఉత్సాహంగా పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను చేపడుతూ ప్రజలతో మమేకమవుతామని తెలిపారు.

ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్‌ ఆహారామృతం!

3. ఎక్కడున్నా శిక్షిస్తాం

‘ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలకు అన్యాయం చేసినవారు ఎక్కడున్నా పట్టుకొస్తాం, చట్టప్రకారం శిక్షిస్తాం. తెలుగుదేశం అధికారంలోకి రాగానే కమిషన్‌ వేస్తాం.. పోలీసులు, అధికారులకు చెబుతున్నా..  తప్పుడు కేసులు పెడితే రేపు అనేది ఉందని మర్చిపోవద్దు’ అని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కార్యకర్తలంతా ఉక్కు సంకల్పంతో రావాలి. ఎవరిమీదైనా కేసులు పెడితే నేను చూసుకుంటా. మీరేమీ లక్షల కోట్లు దోచుకున్న వాళ్లు కాదు తప్పుడు కేసులు పెడితే రికార్డు చేయండి. లాయర్లను పెట్టుకుని వాదిద్దాం. ఆ అధికారిపై ప్రైవేటు కేసు పెడదాం. తెదేపా వచ్చాక మీపై కేసులు లేకుండా చేస్తా’ అని కార్యకర్తలకు హామీ ఇచ్చారు.

ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయరు?

4. రక్షణకు రాచబాటలు

‘ఆయుధాలు... ఆహారం... నీ దగ్గరుంటే విజయం నీ సొంతమవుతుంది.’ ... యుద్ధంలో మౌలిక వసతుల ప్రాధాన్యం గురించి చెప్పే సూత్రమిది. సరిహద్దుల్లో సైనికుల అవసరాలకు తగ్గట్టు ఆయుధాలు, ఆహారం సకాలంలో సరఫరా చేయాలంటే పటిష్ఠమైన మౌలిక వసతులు అత్యవసరం. ఇవి లేకపోవడమే 1962 నాటి యుద్ధంలో భారత్‌ ఓడిపోవడానికి ప్రధాన కారణం. భారతసైన్యం ఇప్పుడీ లోపాలను సరిదిద్దే పనిలో నిమగ్నమైంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది. చైనా సరిహద్దుల్లోని ఈస్ట్రన్‌ సెక్టార్‌లో రూ. 15 వేల కోట్లతో రహదారులు, వంతెనలు, సొరంగాలను శరవేగంగా సిద్ధం చేస్తోంది. 

5. చూడగానే నమ్మకండి!

పాత తరానికి చెందిన ప్రముఖ నటి తీవ్ర అస్వస్థతతో కన్నుమూత. ధ్రువీకరించిన వైద్యులు..  ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సహా సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వచ్చిన వార్త ఇది. ఒక ఛానల్‌లో ప్రసారమైందంటూ గుర్తుతెలియని వ్యక్తులు దానిని వాట్సప్‌ బృందాలకు పంపించారు. అది నిమిషాల్లో వేలమందికి చేరింది. సినీ ప్రముఖులు, పత్రికా విలేకరులు ఆరా తీస్తే తాను బతికే ఉన్నానని ఆమె స్వయంగా ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా వార్తలు క్రమంగా పెరుగుతున్నాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. 

6. చైనాతో పో‘టీ’పడి మనకు రుద్దారు!

వ్యాపారం కోసం భారత్‌లో అడుగుపెట్టిన ఈస్టిండియా కంపెనీ బ్రిటన్‌లో తమ ఖజానా ఖాళీ కాకుండా కాపాడుకోవటానికి ‘టీ’ని భారత్‌కు అంటగట్టింది. కాపాడుకుంటే చాలనుకుంటే ఏకంగా అది తమ ఖజానాను నింపేదిలా మారటం తెల్లవారు కూడా ఊహించని పరిణామం! 18వ శతాబ్దంలో బ్రిటన్‌లో టీకి డిమాండ్‌ ఎక్కువుండేది. వారిక్కావల్సిన తేయాకును చైనా నుంచి దిగుమతి చేసుకునేవారు. దీంతో చాలా సొమ్ము చైనాకు చెల్లించాల్సి వచ్చేది. బ్రిటిష్‌వారి బుర్రలో ఓ ఐడియా వెలిగింది. 

7. ఇన్సులిన్‌.. మోతాదు మించితే ముప్పే

అశాస్త్రీయంగా తీసుకునే ఇన్సులిన్‌ డోసులతో మనిషి శరీరంలోని కణజాలం దెబ్బతినే ప్రమాదం ఉందని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌(టీఐఎఫ్‌ఆర్‌) పరిశోధకులు గుర్తించారు. దీర్ఘకాలంలో క్యాన్సర్‌ వంటి రుగ్మతలకు దారితీసే ప్రమాదమూ లేకపోలేదని తెలిపారు. ‘హెచ్చుతగ్గులతో ఇన్సులిన్‌ డోసులను ఇచ్చినప్పుడు మనిషి శరీరంలోని కణాలు ఏ విధంగా స్పందిస్తాయనే’ విషయంపై హైదరాబాద్‌లోని టీఐఎఫ్‌ఆర్‌ బయోలజికల్‌ డిపార్టుమెంట్‌ ఆచార్యుడు ఉల్లాస్‌ కొల్తూరు నేతృత్వంలో, పరిశోధక విద్యార్థిని నమ్రతా శుక్లా, ఐఐటీ-బాంబే ఆచార్యుడు రంజిత్‌ పాడిన్‌హతిరీ సంయుక్తంగా ఈ పరిశోధన చేపట్టారు.

8. ఏడాదిలో 50% పెరుగుదల

దేశంలో 6 రకాల వంట నూనెల ధరలు ఏడాది కాలంలో దాదాపు 50% వరకూ పెరిగాయి! కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ శుక్రవారం విడుదలచేసిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. గత ఏడాది అక్టోబరు 21 నాటి ధరలతో పోలిస్తే, ఈ అక్టోబరు 21 నాటికి సోయాబీన్‌ నూనె గరిష్ఠంగా 49% మేర, వేరుశనగ నూనె కనిష్ఠంగా 18.71% దాకా పెరిగాయి. అంతర్జాతీయంగా నూనె ధరలు పెరగడం వల్లే దేశీయ మార్కెట్‌లో ఆ ప్రభావం కనిపించినట్టు ఆహార, ప్రజా పంపిణీశాఖ కార్యదర్శి సుధాంశు పాండే పేర్కొన్నారు. ఏడాది కాలంలో అంతర్జాతీయంగా ముడి పామాయిల్‌ ధర 81.66%, సన్‌ఫ్లవర్‌ ధర 40.91% మేర పెరిగినట్టు చెప్పారు. 

9. కోహ్లీసేన, కప్పు మధ్య..

2007లో తొలి టీ20 ప్రపంచకప్‌లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగి సంచలన ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది టీమ్‌ఇండియా. ఆ తర్వాత ప్రతి టోర్నీలోనూ భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది కానీ.. కప్పు మాత్రం అందుకోవట్లేదు. ఎప్పట్లాగే ఈసారి కూడా ఫేవరెట్లలో భారత్‌ ఒకటి. అయితే కప్పు గెలవడానికి అవసరమైన బలాలు భారత్‌కున్నా.. కొన్ని బలహీనతలు కోహ్లీసేన అవకాశాలపై ప్రభావం చూపేలా ఉన్నాయి.

ఆట సిక్సరూ.. చదువేమో బౌల్డ్‌!

10. 12 గంటలపాటు నిలిచిపోనున్న ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌

నిర్వహణ పరమైన పనుల్లో భాగంగా ఆదాయపు పన్ను వెబ్‌సైట్‌ దాదాపు 12 గంటలపాటు నిలిచిపోనుంది. శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు సేవలు అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం ప్రకటించింది. ఈ సమయంలో ఇ-ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా రిటర్నులు సమర్పించడం సాధ్యం కాదు.  ఈ వెబ్‌సైటులో ఇతర సేవలూ అందుబాటులో ఉండవని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని