Top 10 News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Feb 2024 21:13 IST

1. ఏపీ ఉద్యోగుల ‘ఉద్యమ శంఖారావం’

ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న వ్యతిరేక విధానాలపై ఉద్యమానికి దిగుతున్నట్లు ఏపీజేఏసీ ప్రకటించింది. 104 ఉద్యోగ సంఘాలు, కార్యవర్గంతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన ఏపీజేఏసీ నేతలు ఈమేరకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. ‘ఉద్యమ శంఖారావం’ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 27న ఉద్యోగులతో చలో విజయవాడ చేపట్టబోతున్నట్టు తెలిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘మహా స్వాప్నికుడు’ చంద్రబాబు.. పుస్తకావిష్కరణ

తెదేపా (TDP) అధినేత చంద్రబాబు(Chandrababu)పై సీనియర్‌ పాత్రికేయుడు పూల విక్రమ్‌ రచించిన ‘మహా స్వాప్నికుడు’ పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ ఆవిష్కరించారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్‌ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇరిగేషన్‌ శ్వేతపత్రంపై చర్చకు సన్నద్ధం.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

ప్రజాభవన్‌లో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇరిగేషన్‌ శాఖపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సోమవారం అసెంబ్లీలో నీటిపారుదలశాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనున్న తరుణంలో ప్రజాభవన్‌లో ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4.  14 రోజులు.. 17 నియోజకవర్గాల్లో భాజపా బస్సు యాత్రలు

తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1025 కి.మీ మేర ఐదు బస్సు యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి మార్చి 4 వరకు కొనసాగుతాయన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఎం రేవంత్‌రెడ్డితో మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ భేటీ

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు భేటీలో పాల్గొన్నారు. బొంతు రామ్మోహన్‌ భారాసను వీడి కాంగ్రెస్‌లో చేరే అవకాశముందని తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలంగాణ అధికార చిహ్నంలో.. వాటికి ప్రత్యామ్నాయం ఉందా?: వినోద్‌కుమార్‌

తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై భారాస మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకతీయ రాజులు.. ఓరుగల్లు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్ని అద్భుతంగా పాలించారన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్‌ అని చెప్పారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఒకే ఒక్కడు’ తరహాలో కామారెడ్డి ఎమ్మెల్యే వినూత్న ఆలోచన

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి (Kamareddy) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (Katipally Venkata Ramana Reddy) ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందుకోసం వినూత్న ఆలోచన చేశారు. ఒకే ఒక్కడు సినిమా తరహాలో నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్‌ వద్ద ఫిర్యాదు బాక్స్‌ను ఆయన (KVR) ప్రారంభించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మేడారానికి పోటెత్తిన భక్తులు..

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. నిన్న సాయంత్రం నుంచే భారీగా చేరుకున్న భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలాచరించి తలనీలాలు సమర్పించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అయోధ్య సందర్శనలో.. 325 మందికిపైగా యూపీ చట్టసభ్యులు

బాల రాముడు కొలువుదీరిన అయోధ్య రామాలయాన్ని (Ayodhya Ram Temple) ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌ చట్టసభ్యులు (Uttar Pradesh Legislators) సందర్శించారు. 325 మందికిపైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. 10 బస్సుల్లో లఖ్‌నవూ నుంచి అయోధ్యకు చేరుకున్నారు. పుణె నుంచి నేరుగా వచ్చిన ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌.. తన మంత్రివర్గం, సభ్యులతో కలిసి నూతనంగా నిర్మించిన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్చ్‌.. కుర్రాళ్లూ నిరాశే మిగిల్చారు!

అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ (U19 World Cup 2024) సెమీస్‌ వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత్‌.. ఫైనల్‌ (IND vs AUS)లో చేతులెత్తేసింది. తొలుత 7 వికెట్ల నష్టానికి ఆసీస్‌ 253 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని