U19 World Cup Final: ప్చ్‌.. కుర్రాళ్లూ నిరాశే మిగిల్చారు!

అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ (U19 World Cup 2024)లో సెమీస్‌ వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత్‌.. ఫైనల్‌ (IND vs AUS)లో చేతులెత్తేసింది.

Updated : 11 Feb 2024 21:14 IST

బెనోని (దక్షిణాఫ్రికా): అండర్‌-19 ప్రపంచకప్‌ టోర్నీ (U19 World Cup 2024) సెమీస్‌ వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన భారత్‌.. ఫైనల్‌ (IND vs AUS)లో చేతులెత్తేసింది. తొలుత 7 వికెట్ల నష్టానికి ఆసీస్‌ 253 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీమ్‌ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్‌లో ఆదర్శ్‌ సింగ్ (47), మురుగన్ అభిషేక్ (42), ముషీర్ ఖాన్ (22), నమన్‌ తివారి (14*) మినహా.. ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్‌ చేయలేదు. మహ్లి బార్డ్‌మాన్, రఫ్ మ్యాక్‌మిలన్ చెరో 3, కల్లమ్ విడ్లర్‌ 2, ఛార్లీ అండర్సన్, టామ్‌ స్ట్రేకర్ ఒక్కో వికెట్‌ తీశారు. గతేడాది నవంబర్‌ 19న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో సీనియర్‌ ఆటగాళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారనుకుంటే.. కుర్రాళ్లూ నిరాశే మిగిల్చారు.

లక్ష్యఛేదనకు దిగిన భారత్‌కు ఆదిలోనే షాక్‌ తగిలింది. 2.2 ఓవర్‌లో కల్లమ్‌ విడ్లర్‌ వేసిన బంతికి కులకర్ణి (3) వికెట్‌ కీపర్‌కు చిక్కాడు. 12 ఓవర్‌లో బార్డ్‌మాన్‌ వేసిన బంతికి ముషీర్‌ ఖాన్‌ (22) క్లీన్‌ బౌల్డయ్యాడు. భారీ షాట్‌ ఆడబోయి కెప్టెన్‌ ఉదయ్‌ సహరన్‌ (8) వెబ్జిన్‌కు దొరికిపోయాడు. స్వల్ప వ్యవధిలోనే మ్యాక్‌మిలన్ వేసిన బంతి బ్యాట్‌కు తగిలి వికెట్‌ కీపర్‌ చేతిలో పడటంతో సచిన్‌ దాస్ (9) పెవిలియన్‌ చేరాడు. అండర్సన్‌ వేసిన బంతి (24.5)కి భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో ప్రియాన్షు మోలియా (9) క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆరవెల్లీ అవినాశ్‌ (0) డకౌట్‌ కాగా.. 30.3 ఓవర్‌లో బార్డ్‌మాన్‌ వేసిన బంతికి నిలకడగా ఆడుతున్న ఓపెనర్‌ బ్యాటర్‌ ఆదర్శ్‌ సింగ్‌ (47) కీపర్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. ఆ వెనువెంటనే రాజ్‌ లింబాని (0), కొద్దిసేపటికి దూకుడుగా ఆడుతున్న మురుగన్ అభిషేక్ (42) ఔట్‌ కావడంతో భారత్‌ ఆశలు కోల్పోయింది. అంతకుముందు ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో హర్జాస్‌ సింగ్ (55) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రాజ్‌ లింబాని 3, నమన్‌ తివారి 2, సౌమీ పాండే, ముషీర్ ఖాన్ ఒక్కో వికెట్‌ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని