ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లతో ఉన్న వాహనాలపై నిఘా... చర్యలకు సిద్ధమైన ట్రాఫిక్‌ పోలీసులు

జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనల తర్వాత ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు.

Published : 21 Mar 2022 01:19 IST

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనల తర్వాత ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. కారు అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌ పెట్టుకోవడంతో పాటు ఎమ్మెల్యే, ఎంపీల పేర్లతో ఉన్న స్టిక్కర్లతో తిరుగుతున్న వాహనాలపై నిఘా పెట్టారు. వాహనంలో ప్రజాప్రతినిధి లేకపోయినా స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిన్నటి నుంచి ట్రాఫిక్‌ పోలీసులు దీనిపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. బ్లాక్‌ ఫిల్మ్‌ ఉన్న కార్లను గుర్తించి అక్కడే తొలగిస్తున్నారు. చలాన్లు కూడా విధిస్తున్నారు. ఏపీలోని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి పేరుతో ఉన్న స్టిక్కర్‌తో తిరుగుతున్న కారుపై కేసు నమోదు చేసి స్టిక్కర్‌ తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈనెల 18న బోధన్‌ ఎమ్మెల్యే స్టిక్కర్‌తో ఉన్న ఓ కారు జూబ్లీహిల్స్‌లో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రెండున్నర నెలలున్న పసికందు మృతిచెందగా ఏడాది వయసున్న బాలుడితో పాటు ముగ్గురు మహిళలు గాయపడ్డారు. కారుపై బోధన్‌ ఎమ్మెల్యే పేరుతో స్టిక్కర్‌ ఉంది. ఈనేపథ్యంలో అక్రమంగా వివిధ హోదాల స్టిక్కర్లు ఉన్న వాహనాలపై ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని