TSRTC: పంద్రాగస్టు వేళ.. బస్సు టికెట్లపై భారీ రాయితీలు

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆరోజు ప్రయాణికులకు టికెట్లపై భారీ రాయితీలను ప్రకటించింది.

Published : 13 Aug 2023 20:43 IST

హైదరాబాద్‌: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రత్యేక రాయితీలు ప్రకటించింది.  రాష్ట్రంలోని పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్రయాణికులకు టికెట్‌లో భారీ రాయితీలు ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తిరిగే పల్లె వెలుగు సర్వీసుల్లో వెళ్లే సీనియర్ సిటిజన్లకు టికెట్‌లో 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే, హైదరాబాద్ నగరంలో 24 గంటల పాటు అపరిమిత ప్రయాణానికి సంబంధించిన టి-24 టికెట్‌ను కేవలం రూ.75కే ఇవ్వనుంది. పిల్లలకు టి-24 టికెట్‌ను రూ.50కే ఇస్తుంది. ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవం రోజు మాత్రమే ఈ రాయితీలు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.  సీనియర్‌ సిటిజన్లు తమ వయసు ధ్రువీకరణ కోసం ఆధార్‌ కార్డును కండక్టర్‌కు చూపించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ రూ.120 ఉండగా.. మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80గా ఉన్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న భారతీయులందరికీ పర్వదినం కావడంతో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రాయితీలు ఇస్తున్నట్టు ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్దన్‌, ఎండీ సజ్జనార్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ రాయితీలను ఉపయోగించుకుని స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ రాయితీలకు సంబంధించిన వివరాలకు TSRTC కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని