TTD: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇకపై క్యూఆర్‌ కోడ్‌స్కాన్‌ చేస్తే చాలు..!

తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తులకు గుడ్‌న్యూస్‌. పలు ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తులకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఇకపై ఎవరినీ......

Updated : 21 Sep 2022 05:10 IST

భక్తుల అరచేతిలో ‘తిరుమల మార్గదర్శిని’

 కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న తితిదే

తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తులకు గుడ్‌న్యూస్‌. పలు ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తులకు స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. ఇకపై ఎవరినీ అడగకుండానే కొండపై ఒకచోట నుంచి మరో చోటకు సులువుగా చేరుకోవచ్చు. ఇందుకు సంబంధించి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో తితిదే కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. తిరుమలలోని వివిధ కార్యాలయాలను తెలిపే క్యూఆర్‌ కోడ్‌ను రూపొందించింది. ఈ క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్‌ చేస్తే చాలు..  తితిదే అతిథిగృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌, తితిదే లడ్డూ కౌంటర్లు, ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్‌, విజిలెన్స్‌ కార్యాలయాలు.. ఇలా కొండపై ఉన్న విభాగాల వివరాలు ప్రత్యక్షం కానున్నాయి. అలాగే, భక్తులు తాము వెళ్లాల్సిన చోటుపై క్లిక్‌ చేస్తే మ్యాప్‌ కూడా డిస్‌ప్లే అవుతుంది. 

తిరుమలలోని తన కార్యాలయంలో ఈ సాంకేతిక విధానాన్ని ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమలలో తితిదేకి సంబంధించిన అతిథి గృహాలు, వసతి సముదాయాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు,  లడ్డూ ప్రసాదం కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాలు ఇలా భక్తులకు అవసరమైన దాదాపు 40 విభాగాల సమాచారాన్ని తితిదే ఈ క్యూఆర్ కోడ్‌లో నిక్షిప్తం చేస్తోందన్నారు. భక్తులు బస్టాండ్‌లో దిగి సీఆర్వో, అదనపు ఈవో కార్యాలయం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్.. ఇలా ఎక్కడికి వెళ్లాలనుకున్నా తితిదే వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచిన క్యూ ఆర్ కోడ్‌ను తమ మొబైల్ ఫోన్‌లో స్కాన్‌ చేస్తే చాలు.. వారికి విభాగాల వారీగా పేర్లు కనబడతాయని చెప్పారు. అందులో తాము ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రాంతం మీద క్లిక్ చేస్తే మ్యాప్ డిస్‌ప్లే అయి నేరుగా అక్కడకు తీసుకెళ్తుంది. తితిదే ఇంజినీరింగ్, ప్రజా సంబంధాల విభాగాలు రూపొందించిన ఈ విధానాన్ని ఈవో అభినందించారు. ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.. సేవా సదన్ నుంచి వివిధ ప్రాంతాల్లో సేవ చేసేందుకు వెళ్లే  శ్రీవారి సేవకులు వారు వెళ్ళాల్సిన  ప్రాతం కనుక్కోవడానికి ఇబ్బంది పడుతున్నారు. బ్రహ్మోత్సవాల్లో ప్రయోగాత్మకంగా శ్రీవారి సేవకుల  ద్వారా  ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేయాలని పీఆర్వోని ఈవో కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని