Viveka Murder Case: వివేకా హత్య కేసు తెలంగాణకు బదిలీ: సుప్రీం తీర్పు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

Updated : 29 Nov 2022 14:07 IST

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ విచారణపై మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును కడప న్యాయస్థానం నుంచి హైదరాబాద్‌ బదిలీ చేస్తున్నట్లు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా  పేర్కొన్నారు.

ఈ కేసులో సాక్షులను, నిందితులు బెదిరిస్తున్నారని.. కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఆయన కుమార్తె వైఎస్‌ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించింది.

దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉంది..

తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మరణించిన వ్యక్తి కుమార్తె, భార్య సుప్రీంకోర్టు వరకూ రావడమంటే ఈ కేసులో ఎన్ని కుట్ర కోణాలు దాగి ఉన్నాయో అర్థమవుతోంది. విచారణపై వాళ్లిద్దరూ అసంతృప్తిగా ఉన్నందున ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకుని కేసును బదిలీ చేస్తున్నాం. హత్య కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన ఆధారాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. 

ఈ కేసులో దురాలోచనతో కూడిన కుట్ర కోణం దాగి ఉంది. అదే సమయంలో కేసును తారుమారు చేయడంతో పాటు అన్ని రకాల సాక్ష్యాలను ధ్వంసం చేశారు. ఈ పరిణామాలన్నింటిలో ఉన్న కుట్ర కోణం బయటకు రావాలంటే తదుపరి విచారణ కొనసాగాలి. కడపలో స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో విచారణ జరగడం కంటే బయట రాష్ట్రంలో కొనసాగడమే సముచితంగా భావిస్తున్నాం. అందుకే కేసును హైదరాబాద్‌కు బదిలీ చేస్తున్నాం’’ అని తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది.

వివేకా హత్య కేసు విచారణకు స్థానిక యంత్రాంగం ఏమాత్రం సహకరించడం లేదని.. ఎవరిని ప్రశ్నించాలన్నా అడ్డంకులు ఎదురవుతున్నాయని గతంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. దీంతో పాటు సాక్షుల బెదిరింపు సహా ఇతర అంశాలను వైఎస్‌ సునీత సైతం లేవనెత్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు విచారణను హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని