Updated : 11/02/2021 13:55 IST

ఉపాధికీ ఉక్కు సంకల్పమే 

 విశాఖ ఉక్కు చరిత్రలో అలుపెరుగని వీరులు వారు

న్యూస్‌టుడే, గాజువాక : విశాఖ ఉక్కును పోరాడి సాధించుకున్న ఉద్యమ భాస్కరులు.. ఆనక ఉపాధి వేటలోనూ ఎన్నెన్నో తిప్పలు పడ్డారు. రక్తతర్పణం చేస్తూనే ఉద్యోగ స్వరాన్ని ప్రతిధ్వనింపజేశారు. ఒంటిలోకి పోలీసుల తుపాకీ గుళ్లు దూసుకెళ్లినా మడమ తిప్పలేదు. లాఠీ దెబ్బలకు ఒళ్లంతా హూనమై కుప్పకూలినా వారి ఉక్కు సంకల్పం సడలలేదు. ప్రభుత్వాలు దిగివచ్చి ఎట్టకేలకు వారికి పరిశ్రమలో ఉద్యోగాలనిచ్చింది. పోరాటాల్లో ఎదురొడ్డి నిలిచిన వారిలో కొందరు గాజువాక దరి ఉక్కు నిర్వాసిత కాలనీల్లో నివసిస్తున్నారు. విశాఖ ఉక్కును ప్రస్తుతం ప్రైవేటీకరిస్తున్న సమయంలో వారు తమ పోరుబాటను గుర్తు చేసుకుంటున్నారు. చెమటను నెత్తురుగా మార్చి జాతి నిర్మాణానికి చేయూతనిచ్చిన తమ, సాటి కార్మికుల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. మలి విడత ఉద్యమానికి కూడా సిద్ధమంటున్నారు. 

పరిశ్రమ సాధనలో... రణ నినాదం 

పరిశ్రమ ఏర్పాటుకు 22 వేల ఎకరాలనిచ్చిన 65 గ్రామాల నిర్వాసితులకు కుటుంబంలో ఒకరికి చొప్పున ఉద్యోగమిస్తామని 1971 జనవరి 21న స్టీల్‌ప్లాంటు శంకుస్థాపనకు వచ్చిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారు. రోజులు గడుస్తున్నా ఉపాధి లభించక నిర్వాసిత సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు తీవ్రమయ్యాయి. ఉక్కు బీసీ గేటు సమీపంలో (పాత పైలాన్‌ ప్రాంతం) 1986 ఫిబ్రవరి 14న పెద్దఎత్తున చేపట్టిన ఉద్యమం పోలీసు కాల్పులకు దారి తీసింది. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. వందలాది మంది లాఠీ దెబ్బలకు విలవిల్లాడారు. 


అప్పట్లో నిలిచిన ప్రాణాలను మళ్లీ త్యాగం చేస్తా..

నమ్మి పైడిరాజు, మొల్లివానిపాలెం

మా ప్రాంతం వాళ్లతో కలిసి నేనూ ఆందోళనలో పాల్గొన్నా. వెళ్లిపోవాలంటూ పోలీసులు హెచ్చరించినా చావోరేవో తేల్చుకుందామని ధర్నా శిబిరం వద్దే ఉన్నా. పోలీసుల కాల్పుల్లో ఓ తూటా నేరుగా నా గొంతులోంచి దూసుకెళ్లింది. రక్తమోడుతూ కుప్పకూలిన నన్ను వెంటనే కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. బతకడమే కష్టమని వైద్యులు చెప్పారు. 3 నెలలపాటు చికిత్స తీసుకున్నాక దేవుడి దయవల్ల బతికి బయటపడ్డా. 1991లో కలాసీ ఉద్యోగమిచ్చారు. కొత్తగా ప్రారంభిస్తున్న ఉద్యమానికి నా ప్రాణాన్నైనా అర్పిస్తా. అప్పటిలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డా. అప్పుడు నిలిచిన ప్రాణాలను అవసరమైతే మళ్లీ పోరుబాటలో అర్పించడానికి సిద్ధంగా ఉన్నా.


కుడి చేయి కోల్పోయా..

చిట్టిబోయిన కనకరాజు, పెదకోరాడ

నేను ఏడో తరగతి వరకు చదివా. ఉద్యమం రోజుల్లో బీసీ గేటు వద్ద ధర్నాకు రమ్మంటే వెళ్లా. వేలాది మంది రోడ్డును దిగ్బంధించడంతో పోలీసులు లాఠీలతో కొట్టారు. కాల్పులు జరిపారు. ఓ తూటా వచ్చి నా కుడిచేయికి తగిలి మోచేయి ఛిద్రమైంది. ఏడాదిపాటు కేజీహెచ్‌లో చికిత్స పొందా. ఆ తర్వాత కృత్రిమ చేయి అమర్చారు. 1992లో స్టీల్‌ప్లాంటు పరిపాలనా భవనంలో కలాసీగా ఉద్యోగమిచ్చారు. నా సేవలకు గుర్తింపుగా ఏడాది కిందట ఉక్కు సీఎండీ పీకే రత్‌ ‘బెస్ట్‌ వర్కర్‌ అవార్డు’నిచ్చారు. పోరాడే అప్పట్లో ఉద్యోగాన్ని సాధించాం. ప్రస్త్తుతం మళ్లీ అదే పరిస్థితి వస్తే ఉద్యమానికి వెనకాడబోం.


చితకబాదినా కదల్లేదు: - పిలక అప్పారావు, పెదకోరాడ 

అప్పటివరకు నేను సైన్యంలో పని చేసి వచ్చా. స్టీల్‌ప్లాంటులో ఉపాధి కోసం ఉద్యమిస్తున్నప్పుడు నాటి ఎమ్మెల్యే ఆళ్ల రామచంద్రరావు పిలుపు మేరకు బీసీ గేటు ఉద్యమంలో పాలుపంచుకున్నా. పోలీసులు లాఠీలతో కొట్టడంతో నా పక్కటెముకలు విరిగాయి. నెలపాటు చికిత్స పొందా. ఆ తర్వాత ఉక్కు ఎఫ్‌ఎండీ విభాగంలో కలాసీ ఉద్యోగమిచ్చారు. వయోభారం వల్ల ఇప్పుడు పోరాడలేను. నా పిల్లలను ఉద్యమ దిశలో నడిపిస్తా. పోరాడకుంటే భవిష్యత్తు ఉండదని వారికి ధైర్యం చెబుతున్నా.


రెండు తూటాలు కాలిలోకి దిగాయి: - బడి సోములు, గంగవరం

గంగవరం మత్స్యకార గ్రామాలనుంచి వందలాదిగా వెళ్లి ఉద్యమించాం. ఆ సమయంలో రెండు తూటాలు నా కుడి కాలిలో దిగాయి. ఆసుపత్రిలో 6 నెలలపాటు అవస్థలు పడ్డా. నా పేరు ఉక్కు దస్త్రాల్లో తప్పుగా రాయడంతో రెండేళ్లపాటు ఉద్యోగం రాలేదు. మత్స్యకార నాయకుడు కోదండరావు ఉన్నతాధికారులతో మాట్లాడి దస్త్రాలను సరి చేయించడంతో స్టీల్‌ప్లాంటు ఈఆర్‌ఎస్‌ విభాగంలో ఉద్యోగమిచ్చారు. ప్రస్తుతం అనారోగ్యంతో చికిత్స పొందుతున్నా. ప్రైవేటీకరణ గురించి తెలిసి 2రోజుల నుంచి మానసికంగా మరింత ఆందోళన చెందుతున్నా. 

ఇవీ చదవండి..
విశాఖ ఉక్కు భూమిలో పోస్కో ప్లాంట్‌

ఉద్యమం తీవ్రతరం

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని