Andhra News: మాకొద్దు మరుగుదొడ్ల బాధ్యత... సచివాలయ ఉద్యోగుల ఆందోళన

మరుగుదొడ్ల పర్యవేక్షణకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు జారీ చేసిన ఆదేశాలు దుమారం రేపాయి. నగరపాలక సంస్థ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్వహణ..

Updated : 01 Mar 2022 17:13 IST

గుంటూరు: మరుగుదొడ్ల పర్యవేక్షణకు సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు జారీ చేసిన ఆదేశాలు దుమారం రేపాయి. నగరపాలక సంస్థ పరిధిలోని ఐదు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్వహణ కాంట్రాక్టు ఫిబ్రవరి నెలతో ముగిసింది. దీంతో వాటి నిర్వహణను ఆయా ప్రాంతాల్లోని వార్డు కార్యదర్శులు, అడ్మిన్లకు అప్పగిస్తూ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మరుగుదొడ్ల వద్ద ఆదాయం లెక్కలు చూసేందుకు 3 షిఫ్టుల్లో డ్యూటీలు వేసుకోవాలని ఆదేశించారు. గాంధీపార్కు, బండ్ల బజారు, కృష్ణాపిక్ఛర్‌ ప్యాలెస్‌, ఎన్టీఆర్‌ బస్టాండ్‌, కొల్లి శారద కూరగాయల మార్కెట్ల వద్ద ఉండే మరుగుదొడ్లకు సంబంధించి పర్యవేక్షణ చూడాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

మరుగుదొడ్ల వారీగా రోజువారీ లక్ష్యాల్ని నిర్దేశించారు. గాంధీపార్కు వద్ద మరుగుదొడ్లకు రోజుకు రూ.5వేలు లక్ష్యంగా పేర్కొన్నారు. అదనపు కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో వార్డు సచివాలయ కార్యదర్శులు, అడ్మిన్లు మరుగుదొడ్ల వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయాలని అర్ధం వచ్చేలా ఉండటంతో కలకలం రేగింది. దీనిపై అదనపు కమిషనర్‌ నిరంజన్‌రెడ్డిని వివరణ కోరగా.. ఉద్యోగులు కేవలం పర్యవేక్ష బాధ్యతలు మాత్రమే చూస్తారని స్పష్టం చేశారు. ప్రతి మరుగుదొడ్డి వద్ద ఇద్దరు శానిటరీ వర్కర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. డబ్బుల వసూలు, శుభ్రం చేసే బాధ్యత శానిటరీ వర్కర్లదేనన్నారు. సంబంధిత కార్యదర్శులు వారి నుంచి ఆ డబ్బులు తీసుకుని రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు అందజేయాల్సి ఉంటుందని వివరించారు. గతంలో మరుగుదొడ్ల నిర్వహణ గుత్తేదారులదని... వారి నుంచి డబ్బులు వసూలు చేసే బాధ్యత బిల్‌ కలెక్టర్లు చూసుకునేవారని తెలిపారు. ఇప్పుడు బిల్‌ కలెక్టర్ల వ్యవస్థ లేకపోవటంతో ఆయా ప్రాంతాల వార్డు కార్యదర్శులు, అడ్మిన్లు ఈ లెక్కలు చూడాలని ఆదేశించినట్టు చెప్పారు. దీనిపై స్పష్టంగా మరోసారి ఆదేశాలు వస్తాయన్నారు. అయితే, అదనపు కమిషనర్‌ జారీ చేసిన ఆదేశాలపై వార్డు సచివాలయ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్యోగుల్ని ఇలా మరుగుదొడ్ల విధులకు వేయడమేంటమని ప్రశ్నించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని