
నాలుగేళ్ల బాలుడు.. మృత్యువును జయించాడు!
జోధ్‌పూర్: బోరుబావిలోని 90అడుగుల లోతులో చిక్కుకున్న బాలుడు ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ నిన్న బోరు బావిలో పడిపోయిన బాలుడిని అధికారులు 16గంటల పాటు తీవ్రంగా శ్రమించి కాపాడారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని జలోరే జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్ దేవసి (4) అనే బాలుడు గురువారం మధ్యాహ్నం ఆడుకుంటూ బోరుబావిలో పడి 90 అడుగుల లోతులో చిక్కుకుపోయాడు. అక్కడ పనిచేసిన వారు చూసి గ్రామస్థులకు సమాచారం ఇవ్వగా.. వారు పోలీసులకు చెప్పారు. దీంతో బాలుడిని కాపాడేందుకు స్థానికులు, అధికారులతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, పోలీసులు రంగంలోకి దిగారు. ఓ వ్యక్తి తయారుచేసిన ప్రత్యేక పరికరం ఆధారంగా బాలుడిని ప్రాణాలతో కాపాడగలిగారు. లచ్రే గ్రామంలోని మూడు రోజుల క్రితమే బాలుడి తండ్రి పొలంలో ఈ బోరు తీయించారని పోలీసులు వెల్లడించారు.
తొలుత స్థానిక అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఎంత తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం కనబడలేదు. దీంతో గ్రామ సమీపంలోని బిన్మల్‌కు చెందిన మాదారం సుతార్ అనే వ్యక్తి తయారు చేసిన ప్రత్యేక లూప్ టైప్ పరికరం గురించి స్థానికులు అధికారులకు చెప్పారు. దీంతో ఆ టెక్నిక్ ఉపయోగపడుతుందేమోనని భావించిన అధికారులు వెంటనే అతడిని రంగంలోకి దించి బాలుడిని కాపాడగలిగారు. బోర్‌వెల్‌లలో మోటార్లు ఇరుక్కుపోయిన సందర్భంలో సుతార్ ఈ టెక్నిక్‌తోనే వాటిని బయటకు తీసేవాడని పోలీసులు తెలిపారు. బోరుబావిలోని 90 అడుగుల లోతులో చిక్కుకుపోయిన ఆ చిన్నారి ఊపిరి పీల్చుకొనేందుకు ఆక్సిజన్, కొంత ఆహారం కూడా పైపుల ద్వారా పంపించినట్టు పోలీసులు చెప్పారు. బాలుడు నిద్ర పోకుండా ఉండేందుకు సహాయకబృందాలు నిత్యం బాలుడితో కమ్యునికేట్ చేస్తూ చివరకు ప్రాణాలతో కాపాడగలిగామని వివరించారు. మూడు రోజుల క్రితమే పొలంలో బాలుడి తండ్రి ఈ బోరు బావిని తీయించాడని, దాన్ని కప్పి ఉంచినప్పటికీ ఆడుకుంటున్న సమయంలో బాలుడు దాన్ని తొలగించడంతో ఈ ప్రమాదం జరిగినట్టు వివరించారు.